● డీఎస్సీ అక్రమాలపై
జిల్లావ్యాప్తంగా ఎగసిన నిరసన
● లోకేశ్ రాజీనామా చేయాలని,
సీబీఐ విచారణ జరపాలని డిమాండ్
● అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
● ఆంక్షలను ఛేదించి మరీ ఆందోళనలు
● వైఎస్సార్ సీపీ పిలుపునకు విశేష స్పందన
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి సీమపై ఉద్యమ కెరటం ఎగసింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు నైతిక బాధ్యత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్లతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన వేలాదిగా ప్రజలు సోమవారం భారీ నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఉవ్వెత్తున ఎగసిన ఈ నిరసనను అడ్డుకునేందుకు కూటమి పెద్దల కుట్రలు పన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేశారు. ఫలితంగా పలువురు నాయకులు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వేళ నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఈ కుట్రలను, ఆంక్షల సంకెళ్లను ఛేదించుకుని మరీ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా నిరసనాగ్రహం వ్యక్తం చేశారు.
బొమ్మూరులో అడ్డుకున్న పోలీసులు
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ధవళేశ్వరం బ్యారేజీ కాటన్ విగ్రహం నుంచి సాయిబాబా గుడి వరకూ నిరసన ర్యాలీ చేపట్టాలని వైఎస్సార్ సీపీ నేతలు తొలుత నిర్ణయించారు. దీంతో, పోలీసులు ఆదివారం రాత్రి నుంచే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో పాటు ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేశారు. దీంతో, వేణు బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలతో కలసి జాతీయ రహదారి పైకి ర్యాలీ ప్రారంభించారు. కొద్ది దూరం కూడా వెళ్లక ముందే వారిని భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన వేణు, పార్టీ శ్రేణులు అక్కడే బైఠాయించి, నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, చంద్రబాబు నిరంకుశంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, బ్రిటిషర్లను మించిపోయిన నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొడుకు లోకేశ్‌ను రక్షించుకునేందుకు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన శాంతియుతంగా పోరాడుతున్న వారిని పోలీసుల అండతో అడ్డుకోవడం దారుణమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువత, ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, డీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించి జీవితంలో స్థిరపడాలనుకున్న అనేక మంది అభ్యర్థుల ఆశలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చిదిమేసిందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరచి అర్హులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.
మార్గాని హౌస్ అరెస్టు
నిరసన ర్యాలీని అడ్డుకునే లక్ష్యంతో రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, మార్గాని భరత్‌రామ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారి తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆయన ఇంటి వద్దనే ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో వైఎస్సార్ సీపీ ఆందోళనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
రోడ్డుపై జక్కంపూడి రాజా బైఠాయింపు
రాజానగరంలో నిర్వహించాల్సిన ర్యాలీకి హాజరు కావాల్సిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అయినప్పటికీ రాజా తదితరులు తమ ఇంటి వద్ద రోడ్డు పైనే బైఠాయించి, ఆందోళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందనే భయం మంత్రి లోకేశ్‌ను వెంటాడుతోందని అన్నారు. రాజా తల్లి, పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, పోలీసులు కాదు, మిలిటరీని దించినా వైఎస్సార్ సీపీ ఉద్యమాన్ని అణగదొక్కలేరని అన్నారు.
ర్యాలీలు అడ్డుకోవడం అప్రజాస్వామికం
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో శాంతియుతంగా ర్యాలీలు చేస్తూంటే అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యాన మండపేటలోని పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ప్రారంభించిన ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తోటను నిర్బంధించేందుకు విఫలయత్నం చేశారు. ఈ ర్యాలీకి కార్యకర్తలను వెళ్లనీయరాదంటూ వివిధ గ్రామాల్లోని పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు అందజేస్తూ హెచ్చరికలు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు, విద్యార్థులు మొక్కవోని పట్టుదలతో మండపేట మెయిన్ రోడ్డు మీదుగా జాతీయ మహనీయుల విగ్రహాల సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అవకతవకలు జరగకపోతే భయమెందుకు?
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరగకపోతే సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు, లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు ప్రశ్నించారు. కొవ్వూరులో ప్రారంభించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన, పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి లోకేశ్ తప్పుకోవాలని నినాదాలు చేశారు. డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించకపోవడంతో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోవడంతో పేద విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్ తక్షణం తప్పుకోవాలి
డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఉదయం అనపర్తిలో హౌస్ అరెస్టు చేయడంతో ఆయన మధ్యాహ్నం 3 గంటలకు బిక్కవోలు చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంతెన వద్ద బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి, కొత్తూరుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛను హరిస్తున్నారని, ర్యాలీలు అడ్డుకోవడం నియంతృత్వ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.


