రాజమహేంద్రవరం సిటీ: నగరంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం, ఏపీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రియాంకకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ స్థానిక ఏపీ ఎన్జీవో హోమ్ నుంచి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకూ సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ మీసాల మాధవరావు మాట్లాడుతూ, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ డాక్టర్ ప్రియాంక దారుణ మరణానికి కారకులైన వారిని తక్షణమే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పిస్తూ చట్టాలను పక్కాగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
1న చలో విజయవాడ
రాజమహేంద్రవరం సిటీ: ిసీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్లతో వచ్చే నెల 1న చలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్లను నగరంలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆ సంఘం జిల్లా కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యాన నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు ిసీపీఎస్ విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1న విజయవాడలో జరిగే నిరసన మహా ప్రదర్శనకు రాజమహేంద్రవరం పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సత్యనారాయణరాజు, ఏపీ జేఏసీ కో కన్వీనర్లు షరీఫ్, కేజీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కడలిలోకి 1.52 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 1,52,250 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులు ఉంది. ఎగువన కాళేశ్వరంలో 5.66, పేరూరు 9.54, దుమ్ముగూడెం 6.72 మీట ర్లు, భద్రాచలంలో 19.50 అడుగులు, కూనవరంలో 9.30 మీటర్లు, కుంట 5.40, పోలవరం 6.3, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.13 మీట ర్లుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి.
పీజీఆర్‌ఎస్‌కు 296 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 296 అర్జీలు సమర్పించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 157 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్‌ఓ ఎస్.భాస్కరరెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని గడువులో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


