నేడు తొలి ఏకాదశి పూజలు
ద్వారకాతిరుమల: ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్థానిక ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శనివారం విశేషమైన పూజల నిర్వహణకు ఆలయ సిబ్బంది శుక్రవారం ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలిపై నిద్రిస్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో శనివారం వచ్చేది తొలి ఏకాదశి. ఈ రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుందని దేవస్థానం ఆగమ పండితుడు సుదర్శనం శ్రీనివాసాచార్యులు తెలిపారు.
ప్రాణం తీసిన పాల వ్యాన్
దేవరపల్లి: మండలం బందపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై పాల వ్యాన్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సంగాయగూడేనికి చెందిన కవురు రమణ (22), జుత్తిగ జయరామ్ కలిసి మొబైల్ ఫోన్ కొనుగోలుకు శుక్రవారం రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుంచి పాల వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కవురు రమణ అక్కడికక్కడే మృతి చెందగా, జుత్తిగ జయరామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంకట రమణ విజయవాడలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


