వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం సిటీ: విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణతో పారదర్శకమైన విచారణ చేయించాలని, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన ర్యాలీల్లో పాల్గొనాలని రాజా కోరారు.


