కడియం: మండంలోని కడియపులంక గ్రామ దేవత ముసలమ్మతల్లి ఆషాఢ శుక్రవారం సందర్భంగా శాకంబరిగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మకు నిత్యం అలంకారం చేసే రమేష్‌కుమార్‌శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకారం సాగింది. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
కాటన్ సేవలు చిరస్మరణీయం
జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు
ధవళేశ్వరం: ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా డెల్టాను ధాన్యాగారంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జోన్–2 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. కాటన్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. తీవ్ర క్షామంతో అల్లాడుతున్న ఉభయ గోదావరి జిల్లాలను కాటన్ మహాశయుడు సస్యశ్యామలం చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఆగస్టు 8న పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: సాంకేతిక మరమ్మతుల కారణంగా ఆగస్టు 8వ తేదీన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (17268), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం – రాజమహేంద్రవరం (67286), రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285) రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. ఈ రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


