ఆలమూరు: చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీనూకాంబిక అమ్మవారికి ఆదివారం మూడు కిలోల వెండితో తయారు చేసిన రూ.9.5 లక్షల విలువైన త్రిశూలం హస్తాన్ని ఆదివారం భక్తులు సమర్పించారు. ఎన్నారైల సహకారంతో చింతలూరు మహిళా భక్త బృందం ఈ కానుకను ఈఓ ఉండవల్లి వీర్రాజు, చైర్మన్ వీరి అప్పారావుకు అందజేశారు. గన్ని నారాయణరావు, సూర్యలక్ష్మి, గన్ని చిన్నబ్బు, సూర్యభాను, ద్విభాష్యం పద్మావతి, విజయశాంతి, పార్వతి, గుత్తుల విశ్వేశ్వరరావు, నామాల రాంపండు తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా
అధ్యయనోత్సవాలు ప్రారంభం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వైష్ణవ స్వాములు, వేద పండితుల బృంద సభ్యులు ఈ క్రతువులను వైభవంగా నిర్వహించారు. ఉదయం గౌతమీ గోదావరి నుంచి ఆలయ అర్చకులు తీర్థ బిందెను మేళ తాళాలతో ఆలయానికి తీసుకువచ్చారు. స్వామివారికి ఆగమ శాస్త్రానుసారం తొలి హారతి, సుప్రభాత సేవ, మహాలక్ష్మి హోమం జరిపారు. అనంతరం నిత్య సేవాకాలం దివ్య ప్రబంధ పారాయణ చేశారు. నాలుగు వేదాలను, ద్రవిడ వేదాన్ని పారాయణ చేశారు. రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ఎంపీ మహేష్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి
అల్లవరం: హైదరా బాద్ శివారులో రేవ్ పార్టీలో పాల్గొని ఈగల్ టీమ్‌కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌తో పాటు పది మంది దొరికిపోయారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తాగుతూ దొరకడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన మహేష్‌కుమార్‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుందనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ ఉద్యోగిపై లైంగిక వేధింపులు చేశాడని ఫిర్యాదు చేస్తే కనీసం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. డ్రగ్స్, నకిలీ మద్యంతో రోజుకో అత్యాచారం, హత్యలు జరుగుతూ రాష్ట్రం విలవిల్లాడుతుందని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.


