● అన్నయ్య మృతి, చెల్లెలితో పాటు
పిల్లలకు తీవ్ర గాయాలు
● మొండెపులంక వద్ద ఘటన
పి.గన్నవరం: మోటారు సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో అన్నయ్య మృతి చెందగా, చెల్లెలితో పాటు ఆమె ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలు కాగా, కుమార్తె సురక్షితంగా బయటబడింది. ఆ ఐదుగురూ మోటారు సైకిల్‌పై పి.గన్నవరం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. పి.గన్నవరం శివారు చింతపల్లి వారిపేటకు చెందిన చింతపల్లి శ్రీలక్ష్మి ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె సోదరుడు నగరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బళ్ల సురేంద్ర కుమార్ (45) ఈ నెల 13న చెల్లెలు ఇంటికి వచ్చాడు. శ్రీలక్ష్మిని, ఆమె కుమారులు అభినయ్ (10), అవినాష్ (6), కుమార్తె లహరిలను నగరం గ్రామంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. సోమవారం పిల్లలను పాఠశాలకు పంపాలన్న ఉద్దేశంతో చెల్లెలు శ్రీలక్ష్మి తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో సురేంద్ర కుమార్ ఆదివారం సాయంత్రం చెల్లెలిని, పిల్లలను నగరం నుంచి మోటారు సైకిల్‌పై పి.గన్నవరం తీసుకు వస్తున్నాడు. మొండెపులంక శివారు జొన్నల్లంక ప్రాథమిక పాఠశాల సమీపంలో చాకలిపాలెం వైపు వెళ్తున్న ట్రాక్టర్ వీరి మోటారు సైకిల్‌ను ఎదురుగా వచ్చి ఢీకొంది. సురేంద్ర కుమార్‌కు ట్రాక్టర్ తగిలి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీలక్ష్మి, అభినయ్, అవినాష్‌ల కుడికాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లహరి స్వల్ప గాయాలతో బయటపడింది. వీరి వెనుక మోటారు సైకిల్‌పై వస్తున్న మరో నలుగురు వ్యక్తులు కూడా ప్రమాదానికి గురయ్యారు. అయితే వారిలో నాలుగేళ్ల పాప తుప్పల్లో పడిపోవడంతో ఆమెకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని క్షత గాత్రులను అంబులెన్స్‌లో స్థానిక సీహెచ్‌సీ తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం తల్లీ, ఇద్దరు కుమారులను వేర్వేరు అంబులెన్స్‌ల్లో అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రి వద్ద బంధువుల రోదన
రోడ్డు ప్రమాదంలో నగరం గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ మృతితో పి.గన్నవరం సీహెచ్‌సీ వద్ద అతని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడి భార్య వరలక్ష్మి ఐదు నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లింది. అతనికి కుమారుడు భానుప్రకాష్, కుమార్తె శిరీష ఉన్నారు. ఆస్పత్రి వద్ద కుమారుడు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతుడి భార్య వరలక్ష్మి భర్తను కడసారి చూసేందుకు అవకాశం ఉంటుందో లేదోనని బంధువులు వాపోతున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన చెల్లెలు శ్రీలక్ష్మికి అన్న మరణించాడన్న విషయం తెలియదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న శ్రీలక్ష్మి అన్నయ్యకు ఎలా ఉందని అడిగిన తీరు అందరి హృదయాలను కలచివేసింది.


