అంబాజీపేట: కవులు సామాజిక చైతన్యం, అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. ఆదివారం అంబాజీపేట పెద్ద వీధిలోని ఏవీఆర్, యర్రాప్రగడ సూర్య ప్రకాశరావు కల్యాణ మండపంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 165వ శతాధిక కవి సమ్మేళనం జరిగింది. చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ నేటి సమాజంలోని కవులు అక్షర శిల్ప నైపుణ్యంతో కవితాత్మకంగా వాస్తవ రూప వైవిధ్యం చూపించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సామాజిక అభివృద్ధికి సహాయపడే సాహిత్యమంతా అభ్యుదయ సాహిత్యం అవుతుందన్నారు. అంబాజీపేట గురజాడ సేవా సమితి అధ్యక్షుడు అరిగెల బలరామమూర్తి మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక జాతీయ స్థాయిలో 165వ కవి సమ్మేళనం నిర్వహించి, తెలుగు సాహిత్య చరిత్రలో కొత్త చైతన్యంతో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలుగు సాహిత్యానికి వెలుగు నింపుతున్నారన్నారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథి మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితల సాధన చేయాలన్నారు. ఏపీ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ రత్నకొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ ప్రతాప్ చేస్తున్న సేవలను కొనియాడారు. జిల్లా కన్వీనర్ బీవీవీ సత్యనారాయణ, వెంకట్ పొలమూరితో పాటు సుమారు 150 మంది కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. అనంతరం కిమ్స్ వైద్య కళాశాల వైస్ చైర్మన్ మోహన్‌రాజు, వీఆర్వో రాధామనోహర్‌లను ప్రతాప్, కొండ నరసింహారావు, కావూరి శ్రీనివాసశర్మ ఘనంగా సన్మానించారు. జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాల్గొన్న సుమారు 150 మంది కవులు ఉగాది కవి సమ్మేళనంలో తమ కవితల ద్వారా అక్షర విందును అందించారు. కళావేదిక అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, పేరి కామేశ్వరరావు, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు.


