భారం లేని ఉపాధి ద్వారం! | - | Sakshi
Sakshi News home page

భారం లేని ఉపాధి ద్వారం!

Mar 6 2026 8:34 AM | Updated on Mar 6 2026 8:34 AM

పాలిసెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల

’పది’ విద్యార్థులకు చక్కని అవకాశం

ఏప్రిల్‌ 25న ప్రవేశ పరీక్ష

రాయవరం: సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్‌–2026 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్‌బీఏ గుర్తింపు

పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దరి చేర్చేలా కళాశాలలకు అనుబంధంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేయడం ద్వారా ఏటా కళాశాలల్లో క్యాంపస్‌ సెలెక్షన్స్‌ నిర్వహించారు. నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కూడా దక్కాయి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు లభించింది.

భావిజీవితానికి బాటలు

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్‌ కోర్సులు చక్కని వేదికలు. పాలిసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ కోర్సు్‌ోల్ల చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్‌–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 4వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా ప్రకటించారు.

పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ ఇలా..

120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్‌ ఆధారంగా ఎంట్రెన్స్‌ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు.

విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..

పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ సెకండియర్లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.

లభించే కోర్సులివీ..

పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలుచోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. జిల్లాలో 1,560 వరకు వివిధ ట్రేడ్స్‌లో సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలుండగా, కాకినాడ జిల్లాలో కాకినాడలో రెండు, పిఠాపురంలో ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 17 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలుండగా, దాదాపుగా 4,500 సీట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.

విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్‌ ఎంట్రన్స్‌ల క్వాలిఫై మార్కులు 35 గా నిర్ణయించారు.

కోచింగ్‌, మెటీరియల్‌ ఉచితం

త్వరితగతిన ఉపాధి పొందేందుకు పాలిటెక్నిక్‌ చక్కని అవకాశం. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు, సంబంధిత మెటీరియల్‌ కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నాం.

– ఆకుల మురళి, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌, పాలిసెట్‌–2026, రాజమహేంద్రవరం

హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు

పాలిటెక్నిక్‌ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలున్నాయి. పాలిసెట్‌కు సంబంధించిన వివరాల కోసం కళాశాలలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందేలా విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం

– జీవీవీఎల్‌ సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, అనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement