ఎమ్మెల్సీ సోము వ్యాఖ్యలపై జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు
కాకినాడ రూరల్: వేలాది మంది డిపాజిటర్లతో ముడిపడి ఉన్న జయలక్ష్మి సొసైటీపై శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిరాధార ఆరోపణలు చేయడం తగదని చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు తెలియజేశారు. సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ ప్రస్తుత పాలకవర్గం రూ.7కోట్లు దుర్వినియోగం చేసినట్టు తీవ్రమైన ఆరోపణలను ఎమ్మెల్సీ మండలిలో చేశారన్నారు. పెద్దల సభలో నిజాలు మాట్లాడాలని, జయలక్ష్మి సొసైటీపై చేసిన ఆరోపణలకు సంబంధించి సమాచారం మీరు ఎవరు వద్ద తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల సమాచారం తీసుకున్నారా లేదా సొసైటీ ఆఫీసులో సమాచారం తీసుకున్నారా తెలియజేయాలన్నారు. ఇటు వంటి ఆరోపణలు వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని, 20వేల మంది సభ్యులు, డిపాజిట్లరు మనో వేదనకు గురవుతున్నారన్నారు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేయడంతో కేసులు సీఐడీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తమ పాలకవర్గం 67మంది సభ్యుల నుంచి వసూలు చేసిన రూ.7.60 కోట్లు ఉన్నాయని, వారి నుంచి మరో రూ.3కోట్లు వరకు రావల్సి ఉందన్నారు. రూ.7కోట్లు సీఐడీ కేసుల వలన సీజ్ చేసిన వాటిలో ఉన్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, గౌరవ ఎమ్మెల్సీ వీర్రాజుకు తాము వివరాలు అందజేస్తామన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మా బాధలు గుర్తించి ట్రిబ్యునల్‌లో కేసులు పరిష్కారం చేసి ముందుగా సొమ్ము చెల్లించాలన్నారు. సొసైటీ పాలక వర్గ వైస్ చైర్మన్ పీవీ రమణమూర్తి, డైరెక్టర్లు గౌరీ శంకరరావు, సీహెచ్. సుబ్బారావు, శరణార్థి రవిశంకర్ పాల్గొన్నారు.
మీడియాతో
మాట్లాడుతున్న జయలక్ష్మి
సొసైటీ చైర్మన్ త్రినాథరావు


