ధవళేశ్వరం: స్థానిక బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన వివాహిత శీలంశెట్టి నాగవర్ష(30) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన శీలంశెట్టి శరత్, నాగవర్షకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి స్నానానికి వెళ్ళిన నాగవర్ష ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్ళి చూడగా సీలింగ్‌కు ఉరివేసుకొని ఉంది. ఉరి వేసుకొని ఉన్న నాగవర్షను భర్త, అటుగా వెళుతున్న మరొక వ్యక్తి కిందకు దించి స్థానిక డాక్టర్‌ను పిలవగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అన్నయ్య బైరిశెట్టి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీఐ టి.గణేష్ దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహం స్వాధీనం
తాళ్లపూడి: కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం పక్కన గల రజకులు దుస్తులు ఉతికే రేవులో గోదావరి నది ఒడ్డున మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పి విశ్వం ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహానికి సమీపంలో మోటార్ సైకిల్ ఉండగా దానిపై పి వెంకటేశ్వరరావు అని రాసి ఉందని చెప్పారు. అతని వివరాల కోసం ఇతర సేష్టన్లకు సమాచారం పంపామని తెలిపారు. మృతుడు పొకలి వెంకటేశ్వరావుగా అతనిది కృష్ణా జిల్లా కృటివేణు మండలం సీతనపల్లిగా తెలిసిందని తెలిపారు. అతని బంధువులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
మోసగించిన కేసులో
పురోగతి లేక నష్టపోతున్నాం
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట ఐశ్వర్య నగర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమతో డిపాజిట్లు చేయించుకుని మోసగించిందని, ఆ నేపథ్యంలో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నాలుగు నెలలు కావస్తున్నా కేసులో పురోగతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకోలేదని పోలీసుల తీరును బాధితులు తప్పుబట్టారు. మండపేట పట్టణంలో గురువారం బాధితుడు గ్రంధి సూర్య వెంకట ప్రకాష్‌రావు విలేకరులకు తన గోడు చెప్పుకున్నారు. చిట్ అండ్ ఫైనాన్స్ సంస్థలో చేసిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిందని, త్వరలో మీ సొమ్ము తిరిగి ఇస్తామని తమ వద్ద నుంచి డిపాజిట్లు బాండ్లను సంస్థ నిర్వాహకులు వాకచర్ల గుప్తా బంధువు చెక్కా సత్యనారాయణ తీసుకెళ్లారన్నారు. తమ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేయగా మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదు చేసి నాలుగు నెలలు అయినప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోలేదన్నారు. 90 రోజుల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు సుమారు రూ.ఏడు కోట్లు నష్టపోయారని, ఆ సొమ్మును నిందితులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు. కేసును త్వరితగతిన విచారించి బాధితులకు న్యాయం చేయాలని సూర్య వెంకట ప్రకాష్‌రావు పోలీసులను కోరారు.


