● కల్తీ పాల ఘటనలో
తాజాగా మరొకరి మృతి
● 10కి పెరిగిన మరణాలు
● విషమంగా మరో 11 మంది పరిస్థితి
● నిజనిర్ధారణలో అంతులేని నిర్లక్ష్యం
● నేటికీ రాని ల్యాబ్ రిపోర్టులు
● రోజుకొకరి మృతితో ఆందోళనలో బాధిత కుటుంబాలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ పాల దుర్ఘటన రాజమహేంద్రవరంలో ఇంకా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. దీనికి తోడు జిల్లాకు చెందిన మంత్రి సైతం బాధితులు కోలుకోవడం కష్టమంటూ ఓ సందర్భంలో అన్నారు. ఈ పరిణామాలు బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన నింపుతోంది.
ఇప్పటి వరకూ 10 మంది..
కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి చెందగా.. తాజాగా లాలాచెరువుకు చెందిన జి.వెంకటలక్ష్మి (69) స్థానిక కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. అధికారులు మాత్రం తొమ్మిదిగానే చూపుతున్నారు. గత నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజూ ఒక్కొక్కరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో 11 మంది బాధితులు నాలుగు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వీరిలో ఏడుగురిని వెంటిలేటర్‌పై ఉంచి, డయాలసిస్ చేస్తున్నారు. మరో నలుగురికి డయాలసిస్ జరుగుతోంది. వీరి ఆరోగ్య పరిస్థితి గంటగంటకూ ఆందోళనకరంగా మారుతోంది. ఎవరు కోలుకుంటారో వైద్యులకే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదన్న తలంపుతోనే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని, కొంత మంది వైద్యానికి అసలు స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, మృతుల కుంటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బాధితుల బంధువులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
భిన్న వాదనలు
పాల కల్తీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూలెంట్‌లోని ఇథలిన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే, బాధితుల శరీరాల్లో యూరియా అవశేషాలున్నాయని, మరేదైనా కల్తీ జరిగి ఉండవచ్చన్న వైఎస్సార్ సీపీ శ్రేణుల సందేహంపై అధికారులు స్పందించడం లేదు. కల్తీ ఎలా జరిగిందనే నిజం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యాడు. ఇదిలా ఉండగా పాలల్లో ఇథలిన్ గ్లైకాల్ కలవడం వల్లనే సమస్య తలెత్తిందని ఎప్పటిలానే అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. మరో ల్యాబ్‌కు పంపిన నమూనాలు పరిశీలించగా.. పాలల్లో డిటర్జెంట్ కలిసినట్లు నివేదిక వచ్చిందని సమాచారం. దీనిని ఎందుకు బహిర్గతం చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజాలు దాచేందుకు ఇలా చేస్తున్నారా.. లేక విషయం చల్లబడిన అనంతరం నివేదికలు స్పష్టం చేద్దామనే భావనలో ఉన్నారా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
విచారణ ఏమైందో..?
కల్తీకి కారకుడైన పాల వ్యాపారి గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు అతడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయినప్పటికీ కల్తీ పాలకు సంబంధించిన నిజాలు రాబట్టలేకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పాల వ్యాపారి పోలీసులకు నిజం చెప్పలేదా.. లేక తప్పు ఒప్పుకున్నా పోలీసులు దాస్తున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు గణేష్‌ను అత్యంత వేగంగా కోర్టులో ప్రవేశపెట్టి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల వ్యవధిలో పోలీసులు రాబట్టిందేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మృతుల వివరాలు
పేరు, వయసు ఆస్పత్రిలో మృతి
చేరిన తేదీ చెందిన తేదీ
కృష్ణవేణి (76) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 22
టి.రమణి (58) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 23
రాధాకృష్ణమూర్తి (74) ఫిబ్రవరి 17 ఫిబ్రవరి 23
శేషగిరిరావు (72) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 23
బత్తిన మనోహర్ (6) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 24
కె.సత్యనారాయణ (76) ఫిబ్రవరి 17 మార్చి 2
జి.సూర్యారావు ఫిబ్రవరి 17 మార్చి3
ఆర్.సూర్యకుమారి (62) ఫిబ్రవరి 17 మార్చి 4
జి.వెంకటలక్ష్మి (69) ఫిబ్రవరి 17 మార్చి 5
బి.కనకరత్నం ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 20
వీడని కల్తీ గుట్టు
ఈ ‘పాల’కూట విషం ఘటన వెలుగులోకి వచ్చి పక్షం రోజులవుతున్నా అందులో దాగున్న విషం ఏమిటనే గుట్టు వీడటం లేదు. కల్తీ పాలు తాగి పలువురు ఆస్వస్థతకు గురైన సమయంలో అధికారులు హడావుడి చేసి, బాధితుల వద్ద రక్తం, పాల నమూనాలు సేకరించారు. వాటిని పుణేలోని ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ నివేదికలు వస్తే కల్తీ ఎలా జరిగిందో నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. కానీ, రోజులు గడుస్తున్నా నేటికీ ఆ ల్యాబ్ నివేదికలు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో, కల్తీ ఎలా జరిగిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆ రిపోర్టులు ఐదు నుంచి ఏడు రోజుల్లో వస్తాయని అధికారులు చెబుతూనే ఉన్నారు. నేడు, రేపు అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. గురువారం వస్తాయని భావించారు. కానీ, ఇప్పటి వరకూ వాటి జాడే లేదు. ఈ రిపోర్టులు ఎప్పుడొస్తాయనేది అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. ఆ రిపోర్టులు వస్తేనే పాలల్లో ఏం కల్తీ జరిగింది.. బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేమిటి.. ఇథలీన్ గ్లైకాల్ లీకేజీ వల్లనేనా.. లేక యూరియా, డిటర్జెంట్లు కలవడం కారణమా.. బాధితుల అవయవాలు, కిడ్నీలపై అంత ప్రభావం ఎలా చూపిందనే ప్రశ్నలకు జవాబులు లభించే అవకాశాలున్నాయి.


