మాంగల్యం త్వరితనానేనా! | - | Sakshi
Sakshi News home page

మాంగల్యం త్వరితనానేనా!

Mar 6 2026 8:33 AM | Updated on Mar 6 2026 8:33 AM

మాటకలిస్తే చాలు.. పెళ్లి ముహూర్తాలు

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు

ఆ సమయంలో ఏడాది పాటు పెళ్లిళ్లకు బ్రేక్‌

అందుకే ఇప్పుడు తొందర

ఈ నెలలో భారీగా వివాహాలు

సాక్షి, అమలాపురం: గోదావరిలో పుష్కరుడు ప్రవేశించడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ప్రభుత్వం ఆలస్యంగానైనా కళ్లు తెరచి పుష్కర సన్నాహాలకు నెమ్మదిగానైనా సిద్ధమవుతోంది. కానీ ఏడాది ముందుగానే పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. పుష్కరాలు జరిగే ఏడాది కాలం పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల వాసులు పెళ్లిళ్లకు దూరంగా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. ఈ కారణంగానే తమ పిల్లలకు ఈ ఏడాది చివరి నాటికి ఎట్టి పరిస్థితులలోను పెళ్లిళ్లు చేయాలని ఆతృత చూపుతున్నారు.

గోదావరి పుష్కరాల సమయంలో నదీ పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు పెళ్లిళ్లు చేయరాదని నమ్మే వారు. పెళ్లికి ఎదిగిన తమ బిడ్డలకు ఈలోగానే సంబంధం కుదిరి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. దీంతో కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు వివాహం చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ వరకు పలు వివాహ ముహూర్తాలు ఉన్నా ఇప్పుడు మాట కలిస్తే చాలు ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. పుష్కరాలకు నెల రోజుల ముందు నుంచి అంత్య పుష్కరాల వరకూ వివాహాలు చేయరు. గోదావరి జిల్లా వాసులలో చనిపోయిన పితృ దేవతలకు పుష్కర సమయంలో రాజమహేంద్రంలోని అఖండ గోదావరి, ధవళేశ్వరం బ్యారేజీ దిగువన సప్త నదీపాయల వద్ద పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశ దానాలు చేస్తారు. కాబట్టి పరీవాహక ప్రాంతంలో ఏడాదిపాటు శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మంది పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. వచ్చే ఏడాది శూన్యమాసం తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు మిగిలిన రాయలసీమ జిల్లాలకు ఈ ప్రాంత వాసులు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశముంది. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఉభయ గోదావరి జిల్లా వాసులు పుష్కరాలకు ముందే పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నారు.

పుష్కరాల సమయంలో చాలా తక్కువ మంది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేస్తూంటారు. కానీ ఇది శాస్త్ర విరుద్ధంగా భావించేవారు పుష్కరాల ఏడాది సమయం పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. ఈ నమ్మకం కారణంగానే తమ పిల్లల పెళ్లిళ్ల కోసం బంధువులు, మిత్రులను, మ్యారేజ్‌ బ్యూరోల వారిని, ఆన్‌లైన్‌ వివాహ వేదికల వారిని సంద్రించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముహూర్తాలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఎందుకై నా మంచిది కుదిరితే చాలు వివాహం చేసేద్దామనే వారు కూడా ఉన్నారు. పుష్కరాల సమయంలో ఏడాది పాటు వివాహాలు చేయడంపై పరస్పర విరుద్ధ వాదనలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఎందుకైనా మంచిదని ఈ ఏడాది పెళ్లిళ్లు చేసేద్దాం అనేవారు ఎక్కువగా ఉన్నారు.

ముహూర్తాలు తక్కువే..

ప్రస్తుతం ఈ నెల 5, 6, 7 తేదీల్లో వివాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇదే నెలలో మరికొన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌తో పాటు మే 18 వరకూ వివాహాలు నిర్వహించేందుకు అనువైన కాలం. మే 19 నుంచి జూన్‌ 16వ తేదీ వరకూ అధిక జ్యేష్ట మాసం కారణంగా శుభ ముహూర్తాలు లేవు. జూన్‌ 17 నుంచి జూలై 9 వరకూ తిరిగి ముహూర్తాలుండగా, జూలై 14 నుంచి ఆగస్టు 13 వరకూ గురు మౌఢ్యమి, ఆషాఢ మాసం వస్తున్నాయి. ఆ సమయంలో వివాహాలు చేయరు. కొత్త అల్లుళ్లను అత్తవారిళ్లకు రానివ్వరు. తిరిగి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 8 వరకూ పెళ్లి ముహూర్తాలుండగా, సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 10 వరకూ భాద్రపద మాసం కారణంగా ముహూర్తాలు లేవు. అక్టోబర్‌ 11 నుంచి డిసెంబర్‌ 9 వరకూ ఆశ్వయుజ మాసంలో ముహూర్తాలుండగా, అక్టోబర్‌ 19 నుంచి 29 వరకూ శుక్ర మౌఢ్యమి కారణంగా వివాహాలు జరగవు. తిరిగి నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 9 వరకూ కార్తికం, డిసెంబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకూ మార్గశిర మాసాల్లో ముహూర్తాలున్నాయి. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 6 వరకూ శూన్యమాసం. కాబట్టి పెళ్లిళ్లు చేయరు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ మాఘం, మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ ఫాల్గుణ మాసాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఉగాది తరువాత మే నెల వరకూ ముహూర్తాలున్నాయి. అంటే ఇంచుమించు ఏడాది మీద రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లకు హడావుడి పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement