● మల్లవరం సమీపాన సంచారం
● పులికొండ వద్ద మకాం
● మళ్లీ విశాఖ జూ పార్కుకు
తరలించేందుకు యత్నం
అడ్డతీగల/గోకవరం: పోలవరం జిల్లాలో గత 15 రోజులుగా సంచరిస్తూ అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తూ, గిరిజనులను హడలెత్తిస్తున్న పులి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతానికి చేరింది. ఇక్కడి ఏలేరు పరీవాహక ప్రాంతంలోని పులికొండ వద్ద మకాం వేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. అడ్డతీగల సబ్ డివిజన్ సూదికొండ అటవీ క్షేత్రం పరిధిలోని మొల్లేరు – తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం శివారు అటవీ ప్రాంతం వద్ద గంగవరం మండలం ట్యాంకుబీడు వద్ద పులి పాదముద్రలను గురువారం ఉదయం గుర్తించారు. దీంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మల్లవరం శివారు ఏలేరు పరీవాహక ప్రాంతం కావడంతో నీటి కోసం పులి తమ గ్రామానికి వస్తోందని భావిస్తున్నారు. మొల్లేరు, మల్లవరం, భూపతిపాలెం, సూరంపాలెం, వడ్డిచెరువు, రాముల్దేవపురం ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. మరోవైపు మల్లవరం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొలువైన సింగారమ్మ తీర్థం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులికి ఇదివరకే అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. పులి కదలికలను బట్టి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే ఎక్కువగా సంచరించే పులి ఎటువైపు వెళ్తుందనే విషయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. సూదికొండ అటవీ క్షేత్రంతో పాటు అడ్డతీగల, రాజవొమ్మంగి, గోకవరం అటవీ క్షేత్రాల సిబ్బంది అప్రమత్తంంగా ఉండాలని రంపచోడవరం డీఎఫ్‌ఓ శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ సూచనలు పాటించాలని ఫోక్స్‌పేట రేంజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.
పట్టుకునేందుకు యత్నం
ఇదిలా ఉండగా, నెల రోజులకు పైగా తూర్పు గోదావరి, పోలవరం జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పులిని మళ్లీ పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ మేరకు పులిని పట్టుకునేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా అటవీ సిబ్బందిని రప్పిస్తున్నారు. ఈ పులిని పట్టి, బంధించి తిరిగి విశాఖ జూ పార్కుకు తరలించనున్నట్లు అధికారులుచెబుతున్నారు.


