సాక్షి ప్రతినిధి, కాకినాడ: లాభాల వేటలో పడి.. బాణసంచా తయారీ పరిశ్రమల యజమానులు భద్రతను గాలికొదిలేస్తూండటం నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఏదో ఒక ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో 2014లో జరిగిన పేలుడులో దాదాపు 18 మంది మరణించారు. గత ఏడాది అక్టోబర్ 8న రాయవరంలో జరిగిన బాణసంచా విస్ఫోటంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో సంభవించిన భారీ పేలుడులో ఇప్పటి వరకూ 23 మంది మృతి చెందారు. ఈ అన్ని సంఘటనలకూ మానవ తప్పిదాలు, అధికారుల పర్యవేక్షణ లోపాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
పక్కా చర్యలేవీ?
ఈ ప్రమాదాల్లో బలైపోతున్న వారందరూ నిరుపేదలే. రోజంతా కష్టపడితేనే కానీ కుటుంబం గడవని వారే. ఈ ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. భర్తలను, పిల్లలను కోల్పోయి భార్యలు అనాథలుగా మిగులుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాధినేతలు హడావుడిగా వచ్చి, ఆర్థిక సాయం చేసి, అధికారులను బాధ్యులను చేసి చేతులు దులుపేసుకుని వెళ్లిపోతున్నారు. అంతే తప్ప ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ్ కే వాస్తేగానే ఉంటున్నాయి. బాణసంచా తయారీ కేంద్రాల యాజమాన్యాలు పూర్తి భద్రతా చర్యలు పాటించేలా, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. సర్కారు ఇటువంటి పక్కా చర్యలు తీసుకోనందువల్లనే వేట్లపాలెం విస్ఫోటం సంభవించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రతి బాణసంచా తయారీ కేంద్రంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
కలత చెందుతూ.. కన్నీరు పెట్టుకుంటూ..
ఏకంగా 20 మంది సజీవ దహనానికి కారణమైన వేట్లపాలెం పేలుడు ఉమ్మడి జిల్లా చరిత్రలోనే అతి పెద్ద విషాద సంఘటన. మరో 11 మంది అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడినా.. వారిలో తొమ్మిది మందిని 60 నుంచి 80 శాతం కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో సామర్లకోట కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి రాజు, దర్శిపాటి లోవరాజు, వేమగిరి లోవరాజు గడచిన మూడు రోజుల్లో మృతి చెందారు. ఆ కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ముగ్గురి మృతితో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది.
మరణాలు అందుకేనా!?
తారాజువ్వల వంటి పేలుడు పదార్థాలు ఆకాశంలోకి వెళ్లాక రంగురంగుల కాంతులు విరజిమ్ముతూ, భారీ శబ్దాలు రావడానికి పలు రసాయనాలు వినియోగిస్తారు. వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో వినియోగించిన ముడి సరకుల్లో రసాయనాలు కలిపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి శరీర భాగాల్లోకి చొచ్చుకుపోవడం, మందుగుండు ప్రభావంతో శరీరమంతా మంటలు ఒకేసారి అంటుకుపోవడంతో క్షతగాత్రుల శరీరంలో ముఖ్యమైన వ్యవస్థలు దెబ్బ తిన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఫ బర్న్ షాక్ అనే స్థితిలో చర్మం కాలిపోయి, రక్తంలోని ద్రవాలు బయటకు పోతాయి. దీనివలన రక్తపోటు తీవ్రంగా పడిపోతుంది. మెదడు, గుండెకు సరైన రక్తప్రవాహం జరకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతుంది.
ఫ శరీరానికి రక్షణ కవచం చర్మం. అది కాలిపోతే బ్యాక్టీరియా లోపలకు సులభంగా ప్రవేశించి, రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వచ్చి, మరణానికి దారి తీస్తుంది.
ఫ వీటితో పాటు క్షతగాత్రులకు శ్వాసకోశ సమస్యలు కూడా త్వరగా వస్తూంటాయి. భారీ విస్ఫోట సమయంలో వెలువడే పొగ, వేడి గాలి పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బ తిని శ్వాస తీసుకోవడం కష్టమై, ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది.
ఫ కాలి, తీవ్రంగా గాయపడిన వారిలో గుండె, మూత్రపిండాల వంటి ముఖ్య అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. వాటి పనితీరు నెమ్మదించడం కూడా మరణానికి కారణమవుతుంది.
ఫ తీవ్రమైన నొప్పితో పాటు శరీరంలోని ద్రవాలు తగ్గిపోతూండటం కూడా ప్రాణాలను బలి తీసుకుంటుంది.
ఫ క్షతగాత్రుల శరీరం 50 శాతం కన్నా ఎక్కువ కాలిపోతే ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. వేట్లపాలెం విస్ఫోటంలో జీజీహెచ్‌కు వచ్చిన తొమ్మిది మంది క్షతగాత్రుల్లో దాదాపు అందరూ 70 శాతం పైగా కాలిపోయిన వారే.
ఫ మొదటి స్థాయి కాలిన గాయాలతో పెద్దగా ప్రమాదం ఉండదు. చర్మం పై పొర (ఎపిడెర్మిస్) మాత్రమే దెబ్బ తింటుంది. చర్మం ఎర్రబడి నొప్పి తక్కువగా ఉంటుంది. చర్మంపై నీటి బుడగలు ఏర్పడవు. సూర్యకిరణాల వల్ల చర్మం కాలినప్పుడే ఈ సమస్య ఉంటుంది. ఇది ప్రాణాపాయం కాదు.
ఫ రెండో స్థాయి కాలిన గాయాలు కూడా పెద్దగా ప్రమాదకరమైనవి కావు. వీటి వలన చర్మం పై పొరతో పాటు లోపలి పొర (డెర్మిస్) కూడా దెబ్బ తింటుంది. నీటి బుడగలు వచ్చి, నొప్పి ఎక్కువగా ఉంటుంది. చర్మం తడిగా కనిపిస్తుంది. రెండు మూడు వారాల్లో మానిపోతుంది. కొన్నిసార్లు మచ్చలు మాత్రం మిగులుతాయి.
ఫ మూడో స్థాయి కాలిన గాయాలతో చర్మం పొరలు మొత్తం నాశనమవుతాయి. లోపలి కండరాలు, నరాలు కూడా దెబ్బ తింటాయి. చర్మం తెలుపు, గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. నరాలు కాలిపోవడంతో నొప్పి ఉండకపోవచ్చు. కానీ, ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. ఎక్కువ భాగం కాలిపోతే ప్రాణాపాయం ఎక్కువ. వేట్లపాలెం విస్ఫోటంలో ఈ స్థాయిని మించే క్షతగాత్రుల శరీరాలు కాలిపోయాయి. అందువల్లనే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని వైద్యులు చెబుతున్నారు.
ఫ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న
బాణసంచా తయారీ
ఫ బలైపోతున్న నిరుపేదలు
ఫ సంఘటన జరిగినప్పుడే
సర్కారు హడావుడి
ఫ ఆ తర్వాత ఉదాసీనత
ఫ అందువల్లనే తరచుగా విస్ఫోటాలు


