కల్తీ పాల ఘటనతో మాకు సంబంధం లేదు | - | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటనతో మాకు సంబంధం లేదు

Mar 4 2026 7:41 AM | Updated on Mar 4 2026 7:41 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం 1946లో ఏర్పడి 70 ఏళ్లుగా నిర్విరామంగా పనిచేస్తోందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూరంపూడి పనసయ్య, లంక రామకృష్ణ తెలిపారు. స్థానిక టి.నగర్‌లోని రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిల్క్‌ డెయిరీలు ఏర్పాటు కాని నాటి నుంచి పాలవర్తకులే ఇంటింటికీ వెళ్లి పాలు పోస్తున్నారన్నారు. ఈ 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ పాలకల్తీ ఘటన లాంటివి చోటు చేసుకోలేదన్నారు. ఇటీవల రాజమండ్రిలో పాలకల్తీ ఘటనలో పలువురు మరణించడం, అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చికిత్స పొందుతుండటం చాలా బాధాకరమన్నారు. అయితే ఈ ఘటనతో పాలవర్తక సంఘానికి సంబంధం లేదన్నారు. పాలకల్తీ ఘటనతో సంబంధం ఉన్న పాలవ్యాపారి గణేష్‌ తమ సంఘానికి చెందిన వ్యక్తి కాదన్నారు. తమ సంఘంలో 850 మందికి పైగా వ్యాపారులు ఉన్నారని, నగరానికి 60 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు పాలు సరఫరా చేస్తున్నామన్నారు. గణేష్‌ అనే పాలవ్యాపారి చేసిన తప్పునకు ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ ఘటనను ఆసరాగా తీసుకుని విజయ డెయిరీ అధ్యక్షుడు ప్రైవేట్‌ పాల వ్యాపారులు కల్తీ చేస్తున్నారని, వారి వద్ద పాలు కొనవద్దని ప్రకటన చేయడం సరికాదన్నారు. పాల వ్యాపారంపై ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తాము స్వచ్ఛమైన గేదె పాలను సరఫరా చేస్తామని, స్వచ్ఛమైన గేదె పాలను 8 గంటల లోపు వేడి చేయని పక్షంలో విరిగి పోతాయని, అయితే పాలప్యాకెట్‌ పాలు మాత్రం 36 గంటల వరకు కూడా వేడిచేయకున్నా పాడుకావు అంటే అందులో ఏమి కలుపుతారో ఆలోచించాలన్నారు. విజయ డెయిరీ చైర్మన్‌ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. తాము సంఘం తరఫున కలెక్టర్‌ను కలిసి, తమ సభ్యులకు గుర్తింపు కార్డులు అందించాల్సిందిగా కోరతామన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ రాయుళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాతాదారుల నమ్మకంపైనే తమ వ్యాపారం సాగుతోందన్నారు. సంఘ సభ్యులు వరగోగుల గోవింద్‌, జగ్గు శ్రీనివాస్‌, కొత్త గడకరావు, నల్లజర్ల నాగు, నంద్యాల నాగవరప్రసాద్‌, పాలకుల గాంధీ, గనిశెట్టి రాంబాబు, పూసల వెంకట్రాజు, మన్నె నాగేశ్వరరావు, అడ్డగర్ల ఈశ్వరరావు, పెంటగళ్ళ సుబ్బారావు, అల్లాడ సత్తిబాబు, అద్దేపల్లి నాగరాజు పాల్గొన్నారు.

70 ఏళ్లుగా పాలు, పెరుగు

వర్తక సంఘం నడుస్తోంది

పాల వ్యాపారి గణేష్‌

మా సంఘ సభ్యుడు కాదు

రాజమండ్రి పాల, పెరుగు

వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement