ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ తూర్పుగోదావరి జిల్లా సబ్ రిజిస్ట్రార్‌లు, ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని రాజమహేంద్రవరంలో మంగళవారం ఎన్నికల అధికారి కాకినాడ సబ్ రిజిస్ట్రార్ రాయుడు వెంకటరామారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణ రాజు, వైస్ ప్రెసిడెంట్‌గా బీఎస్‌ఆర్ మూర్తి, జనరల్ సెక్రటరీగా ఎంవివి.కృష్ణ, కోశాధికారిగా పి.అజయ్‌శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా జి.కొండారాజు, లేడీకో ఆప్టెడ్‌గా పి. శ్రీదేవి, ఎలక్టడ్ మెంబర్స్‌గా ఎండీ షాజహాన్, బి.వెంకటేశ్వర రావు, ఈ. శివ గణేష్‌లు ఎన్నికయ్యారు. సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా రాయి రాంబాబు, రాజమహేంద్రవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, కె.సుందరరావు, కొవ్వూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎం.రాజబాబు, నిడదవోలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎంవివి.త్రినాథరావు, పిడింగొయ్యి జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌లు ఎన్నికయ్యారు.
వేట్లపాలెం
బాధితులను ఆదుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలెక్టర్ షణ్మోహన్‌ను కాకినాడలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి, పింఛను సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలిచి, అవసరమైన అన్ని సహాయ సహకారాలూ అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డోకుబుర్ర భద్రం మాస్టారు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో మారేడుమిల్లి
వైటీసీ మేనేజర్ మృతి
రంపచోడవరం: మారేడుమిల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ) మేనేజర్ సుదీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సోమ వారం మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వస్తుండగా దేవరపల్లి సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో కుడి కాలు విరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించగా మంగళవారం మృతి చెందారు.


