ప్రైవేటుకే ఏటీఎస్‌ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకే ఏటీఎస్‌ సెంటర్‌

Mar 4 2026 7:41 AM | Updated on Mar 4 2026 7:41 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక (ఏటీఎస్‌) ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ మంజూరురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్‌నెస్‌ను సర్టిఫై చేసేవారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఆయా వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ప్రైవేటు సంస్థకు చెందిన వెహికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్‌లో జరుగుతున్నాయి. ఈ ప్రైవేటు సంస్థకు అజమాయిషీ ఎవరూ ఉండరు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. దీంతో అడిగేవారు లేక ఇష్టానుసారంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేశ్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర సాగడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నేతకు ఫిట్‌నెస్‌ సర్టిఫై చేసే అధికారాన్ని సర్కారు కట్టబెట్టేసింది. దీంతో ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయుడైన అతను ఎగిరి గంతేస్తున్నాడు!

● స్కూల్‌ బస్సులు, లారీలు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలి. ఇది వరకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి లోపం ఉంటే సర్టిఫికెట్‌ జారీని నిలిపివేసేవారు. ఫలితంగా వాహనాల కండీషన్‌ సక్రమంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆధికారాన్ని ప్రైవేటుకు అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణ ఉండటం లేదు. ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు ఫిట్నెస్‌ లేకపోయినా.. మామూళ్లు దండుకుని రైట్‌ అనేస్తున్నారన్న విమర్శలున్నాయి.

● వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి(ఆర్టీఏ) కార్యలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నడిచేది. ప్రస్తుతం అదేమీ నడవడం లేదు. వాహనం కొనుగోలు చేసిన డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేలా చేస్తున్నారు.

● డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీని సైతం ప్రైవేటు పరం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.

● వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల అనుమతులను కార్యాలయ పరిపాలన స్థాయిలో మాన్యువల్‌గా చేసి జారీ చేసేవారు. వాటిలోకి ఆన్‌లైన్‌ సేవలను తీసుకురావడంతో.. రుసుం చెల్లించి కార్యాలయానికి వెళ్లకుండానే అనుమతులు పొందేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను ప్రైవేటు పరం చేసి చివరకు ఆర్టీఏ శాఖను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement