తాటాకిళ్లు దగ్ధం
శంఖవరం: జి.కొత్తపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. వీఆర్వో సింహాచలం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బర్ల సింహాచలం, పల్లా నారాయణమ్మ, పెంటపాటి వరలక్ష్మి కుటుంబాలు మూడు తాటాకిళ్లలో పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. వారు నిద్రపోతుండగా విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆ తాటాకిళ్లు కాలిపోయాయి. నిత్యావసరాలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సర్పంచ్ ఈగల విజయదుర్గ కోరారు.


