నల్లజర్ల: పాము కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందింది. ఆ వివరాల ప్రకారం.. అనంతపల్లిలో చోడవరం రహదారి పక్కన నివాసం ఉంటున్న తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె వన్సిక (3) బుధవారం సాయంత్రం ఆరుబయట మూత్ర విసర్జనకు వచ్చింది. పక్కనే చెత్తలో ఉన్న తాచుపాము ఆమెను కాటేసింది. జరిగిన సంఘటన తల్లికి చెప్పి ఆ బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు సమీప బంధువులు తెలిపారు. ఆ బాలిక తండ్రి ప్రకాష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కుమార్తె మరణ వార్త విని స్వస్థలానికి తిరిగి వస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
గీత కార్మికుడి మృతి
చాగల్లు: పాము కాటుకు గురై ఓ కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లుకు చెందిన దొంగ వెంకటేశ్వరరావు (51) గీత కార్మికుడు. నెలటూరు గ్రామ పరిధిలోని రుద్రబోయిన బుల్లిరాజుకు చెందిన పొలంలో తాటిచెట్ల వద్దకు వెళ్లి కల్లు తీయడానికి వెళ్తుండగా విష సర్పం కాటేసింది. అతన్ని వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతుడి అతని భార్య దొంగ పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


