దారుణంగా పడిపోయిన దిగుబడి
కళావిహీనంగా తోటలు
ఎకరాకు 10 క్వింటాళ్లే చేతికి
ధర బాగున్నా, ఫలితం శూన్యం
దేవరపల్లి: నిమ్మ పంట దిగుబడి పులుపెక్కింది.. ఈ ఏడాది దారుణంగా పడిపోయింది.. కాయలు లేక తోటలు కళావిహీనంగా మారి, రైతన్నలకు కష్టం తెచ్చింది.. ధర బాగున్నా, దిగుబడి లేకుండా పోయింది.. ఎకరాకు 2.5 టన్నులు రావాల్సి ఉండగా, టన్ను కాయలూ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి, కౌలు సొమ్ము వచ్చేట్టు కనిపించడం లేదు. ధర బాగున్నా దిగుబడులు తగ్గడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ఎర్రనేలల్లో నిమ్మకాయల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
కొవ్వూరు డివిజన్ దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, తాళ్లపూడి, పెరవలి, నిడదవోలు మండలాల్లో సుమారు 2,200 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నాయి. దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ మండలంలో సుమారు 800 ఎకరాలు ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూత రాగా, ఫిబ్రవరి నెల నుంచి దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన పూతతో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దిగుబడి ఉంటుంది.
ఈ ఐదు నెలలు నిమ్మకాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. వేసవిలో పండిన కాయలకు గిరాకీ ఉండి గిట్టుబాటు ధర లభిస్తోంది. వర్షాకాలంలో పండిన కాయలకు డిమాండ్ ఉండదు. వర్షాకాలంలో పూత శీతాకాలంలో కాపుఉంటోంది. అయితే నిమ్మకాయల వినియోగం తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉంటాయి. కిలో రూ. 8 నుంచి రూ.10 పలుకుతాయి. అయినా కొనుగోలు చేసే నాధుడు కనిపించక రైతులు చెట్ల కిందే వదిలేస్తారు.
ప్రస్తుతం కిలో రూ.80
మార్కెట్లో నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉంది. మొన్నటి వరకూ కిలో కాయలు రూ. 8 నుంచి రూ.10 పలికగా, ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కు చేరింది. ఎండల తీవ్రత పెరగడంతో పాటు తోటలు కాపులు లేక దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో ధర పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో కిలో రూ. 40 ఉంది. అయినప్పటికీ వేసవి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిట్టుబాటు అయ్యింది. కిలో కాయలు రూ. 35 నుంచి రూ.50 నిలకడగా కొనసాగడంతో పెట్టుబడి పోను రైతులు నాలుగు డబ్బులు మిగిలాయి. ఈ ఏడాది వేసవి సీజన్‌లో మార్కెట్లో ధర రూ.120 దాటవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు.
కౌలు రైతులకు తప్పని నష్టం
నిమ్మ సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరం కౌలు రూ. 90 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండగా, పెట్టుబడి మరో రూ. 25 వేలు అవుతుంది. నిమ్మతోటకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఎక్కువగా సేంద్రియ ఎరువులను వేయాలి. ప్రస్తుత పరిస్థితిలో దిగుబడులు లేక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
యాదవోలు మార్కెట్లో విక్రయాలు
యాదవోలు మార్కెట్లో రైతులు పంటను అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు 20 నుంచి 25 టన్నుల కాయలు వస్తున్నాయి. కాపులు బాగుంటే రోజుకు 60 నుంచి 70 టన్నుల విక్రయాలు జరుగుతాయి. దేవరపల్లి మండల పరిసర గ్రామాల నుంచి పంటను రైతులు యాదవోలు మార్కెట్‌కు తీసుకువస్తారు. ఏలూరు తర్వాత పెద్ద మార్కట్ యాదవోలు. ఇక్కడ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కాయలను ఒడిశా, కోల్‌కతా, విశాఖ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
కలుపు మందుల ఎఫెక్ట్
నిమ్మ తోటలకు విచ్చలవిడిగా కలుపు మందు పిచికారీ చేస్తున్నారు. దీని ప్రభావం మొక్కలపై పడి దెబ్బతింటున్నాయి. తోటలు నిగనిగలాడడంలేదని, ఎర్రబడి కొమ్మలు ఎండిపోతున్నట్టు రైతులు తెలిపారు. కలుపు మందులతో పాటు క్రిమిసంహారక మందుల వాడకం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో కాయలు గుత్తులుగా ఉండేదని, చెట్టుకు 100 కిలోల కాయల దిగుబడి వచ్చేవని రైతులు తెలిపారు. ఎకరాకు ఏడాదికి 40 క్వింటాళ్లు దిగుబడి వచ్చేవని అన్నారు.
పెట్టుబడి కూడా రాదు
నిమ్మ ధర బాగుంది. అయితే దిగుబడి లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటలు కాపులు కాయలేదు. ఎకరాకు 3 టన్నుల కాయలు దిగుబడి రావాల్సి ఉండగా, టన్ను కూడా లేవు. పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 100 కిలోల కాయలు కోయడానికి రూ. 2,200 ఖర్చు అవుతుంది. వేసవి పంటలపై ఆశలు పెట్టుకుంటాం. ఈ సారి ఆశాజనకంగా లేదు. – గడా రాంబాబు, నిమ్మ రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం
వేసవి పంటపైనే ఆశలు
వేసవి పంటపై ఆశలు పెట్టుకున్నాం. ప్రస్తుతం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం యాదవోలు మార్కెట్లో కిలో కాయలు రూ. 80 పలుకుతున్నాయి. డిసెంబర్, జనవరిలో కిలో ధర రూ. 8 ఉంది. ఈ నెలలో ధర పెరిగింది. ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేవు. నిమ్మ రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులు ఉన్నారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు.
– లకంసాని శ్రీనివాసరావు, నిమ్మరైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం


