పంపాలో కొండచిలువ హల్‌చల్
అన్నవరం: స్థానిక పంపా ప్రాజెక్టు గేట్లు, పరిసరాలలో బుధవారం భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. పంపా ప్రాజెక్టు గేట్లు, బ్యారేజీ వద్ద బుధవారం సుమారు పది అడుగుల కొండచిలువను స్థానిక యువకులు గుర్తించారు. అక్కడికి దగ్గరలోనే పలు కుటుంబాలు గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ సమాచారంతో వారు ఆందోళన చెందారు. కొండచిలువ సంచారం విషయాన్ని యువకులు ప్రాజెక్టు సిబ్బందికి తెలియజేయగా వారు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. శంఖవరం ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ నాగేశ్వరరావు తన బృందంతో వచ్చి దానిని చాకచక్యంగా గోనెసంచెలో బంధించారు. దాని బరువు 12 కిలోలు ఉండగా పొడవు 8.2 అడుగులు ఉందని తెలిపారు. దానిని పాండవుల కొండ రిజర్వ్‌ఫారెస్ట్‌లో వదిలిపెట్టినకుట్టు అటవీ సిబ్బంది తెలిపారు.
రాయి పడి కార్మికుడి మృతి
దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో నల్లరాతి క్వారీలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం గౌరీపట్నం పంచాయతీ శివారు కొండగూడెంలోని ఓ క్వారీలో బుధవారం కార్మికుడు అవిటి యేసు (42) డ్రిల్లింగ్ చేస్తుండగా, పై నుంచి రాయి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. యేసుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పంపాలో కొండచిలువ హల్‌చల్


