ప్రశాంతంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్‌లో తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 18,888 మంది పరీక్షలు రాయాల్సి వుండగా 18, 617 మంది హాజరయ్యారు. 271 మంది పరీక్షలు రాయలేకపోయారు. వృత్తి విద్యాకోర్సుల్లో 1,885 మందికి 1,794 మంది పరీక్షలు రాశారు. 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయని ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఐ.శారద తెలిపారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేత
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పాల కల్తీ కారణంగా మృతిచెందినవారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం చెక్కులు ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించామని కలెక్టర్ కీర్తి అన్నారు. మంగళవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆనాల ఎన్‌క్లేవ్ వద్ద తాడి కృష్ణవేణి, తాడి రమణిలకు సంబంధించిన రూ.20 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, లాలాచెరువు గ్లో గార్డెన్ సమీపంలో మృతుడు నీలా శేషగిరిరావు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందించారు. అనంతరం కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ చికిత్స పొందుతున్న బాధితుల ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందన్నారు.
రేపటి నుంచి
సీ పోర్టు రోడ్డు మూసివేత
కాకినాడ రూరల్: కాకినాడ డీప్ వాటర్ పోర్టు (సీ పోర్టు) నాలుగో గేటు – కుంభాభిషేకం ఆలయం మధ్య ఏడీబీ రోడ్డుపై (ఎన్‌హెచ్–216ఎఫ్) లెవెల్ క్రాసింగ్ గేట్ మేజర్ మరమ్మతులు, ట్రాక్ రిపేర్లు చేపడుతున్నారు. ఈ దృష్ట్యా గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు సీ పోర్టు మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 నుంచి శనివారం సాయంత్రం 7 గంటల వరకూ మరమ్మతులు చేపడుతున్నందున ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లిస్తామన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.


