కూటమికి పచ్చవాతం!
కష్టపడిన వారికి ప్రాధాన్యమేదీ?
రాజమహేంద్రవరంలో టీడీపీ బలోపేతానికి పనిచేసిన నేతలకు ప్రాధాన్యం కరవైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షో చేసే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే వాసు వ్యవహార శైలితో టీడీపీ సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. పార్టీ పటిష్టతకు బుడ్డిగా ఒక్కరే కృషి చేశారా? మేము కష్టపడలేదా? అని మండిపడుతున్నారు.
● జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వని టీడీపీ
● నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీజేపీకీ
మొండిచెయ్యి
● కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు
● రాజమహేంద్రవరంలో ఒకే నేతకు
ఆరు పదవులు!
● గోపాలపురంలో జనసేన వర్సెస్ టీడీపీ
● నిడదవోలులోనూ అదే తంతు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. జనసేన నేత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యం దక్కడం లేదు. టీడీపీ ప్రాతినిధ్య నియోజకవర్గంలో జనసేన నేతలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలి టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. టీడీపీ నేతల వ్యవహార శైలిని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతగా అంటే టీడీపీ నేతలపై జనసేన నాయకులు బహిరంగ విమర్శలు గుప్పించే పరిస్థితి తలెత్తింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ టీడీపీ పెత్తనాన్ని జనసేన, బీజేపీ నేతలు భరించలేకపోతున్నారు.
పదవులన్నీ బుడ్డిగకేనా?
రాజమహేంద్రవరం సిటీ టీడీపీలో పదవుల పంచాయితీ రచ్చ లేపుతోంది. జిల్లా, సిటీ స్థాయి పదవులన్నీ బుడ్డిగ రవికే కట్టబెట్టడం టీడీపీ కేడర్‌కు మింగుడుపడటం లేదు. ఇప్పటికే రాజమహేంద్రవరం సిటీ 38వ వార్డు ఇన్‌చార్జి, రాజమహేంద్రవరం సిటీ క్లస్టర్ ఇన్‌చార్జి, రాజమహేంద్రవరం సిటీ బీసీ సెల్ ప్రెసిడెంట్, ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పదవుల్లో రవి కొనసాగుతున్నారు. జిల్లా టీడీపీ మెయిన్ కమిటీలోనూ బుడ్డిగా రవి భార్య వెంకటరమణికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఉండగా.. టీడీపీ రాజమహేంద్రవరం నగర ప్రధాన కార్యదర్శి పదవి సైతం తనకే దక్కాలంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వద్ద పావులు కదుపుతుండటంపై టీడీపీ శ్రేణులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఆ పదవిని సైతం బుడ్డిగ కుటుంబానికే కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే వాసు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. రేపో మాపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండటంతో టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు టెంట్‌హౌస్, కుర్చీలు, టేబుళ్లు సమకూర్చే కాంట్రాక్ట్ సైతం బుడ్డిగ రవి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ కుటుంబానికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే కుటుంబానికి అన్ని పదవులు కట్టబెట్టడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారన్న కారణంగా ఇదంతా చేశారా? అన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో తలెత్తుతోంది.
గోపాలపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. నువ్వెంతంటే నువ్వెంత అన్న స్థాయికి చేరింది. చివరకు ఎమ్మెల్యేను నిలదీసే పరిస్థితి తలెత్తింది. టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన నేతలకు కనీస విలువ ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. కూటమి తరఫున నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాలకు జనసేన నేతలను, చివరికి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజును సైతం ఆహ్వానించకపోవడంపై పార్టీ కేడర్ గుర్రుగా ఉంది. ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో సైతం వేసేందుకు ఇష్టపడటం లేదంటే జనసేనకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం అవుతోంది. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి, ఆ పార్టీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలకు సైతం కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే అన్నీ తానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
మంత్రి వద్ద పంచాయితీ
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేతలు మంత్రి కందుల దుర్గేష్ వద్ద పంచాయితీ పెట్టారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయమై మంత్రి, ఎమ్మెల్యేలను నిలదీశారు. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో గ్రామ దేవత గుడి సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఆచారం ప్రకారం తుమ్మలమ్మ గుడి పర్యవేక్షణ బాధ్యతలు తలంశెట్టి వంశీయులు నిర్వహిస్తున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన జనసేన, బీజేపీ నేతలు అమ్మవారి పూర్వ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ ఆలయంతో తమకు సంబంధం లేదని గ్రామ టీడీపీ నేతలు బహిరంగంగా ప్రకటించడంతో నాలుగేళ్లుగా ఈ పాత గుడిని జనసేన పార్టీకి చెందినవారే సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం పూర్వపు అమ్మవారి ఆలయానికి ప్రాధాన్యం రావడంతో కొత్త గుడి నిర్మించిన టీడీపీ వర్గం.. పాత గుడి కూడా తమదేనంటోంది. ఇది వివాదంగా మారింది. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మద్దిపాటి దృష్టికి తీసుకెళ్లినా.. లాభం లేకపోవడంతో మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
● రాజానగరంలో పార్టీ ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి ఏర్పడ్డ పోటీతో ఈ వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది.
● నిడదవోలులో సార్వత్రిక ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు, జనసేనకు ఎమ్మెల్యే స్థానం కేటాయించినప్పుడు తలెత్తిన వైషమ్యాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా జనసేన నేత దుర్గేష్ నెగ్గి మంత్రి వర్గంలో స్థానం సాధించినా అసమ్మతి జ్వాలలు మాత్రం ఆరడం లేదు. జనసేన నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలి టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిన వారిని సైతం జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
జనసేన, బీజేపీ నేతలకు నిరాశే?
చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ దశల నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన, బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపారు. టీడీపీలోనే నామినేటెడ్‌పై ఆశావహుల సంఖ్య పెరిగిపోవడంతో బీజేపీ, జనసేనకు ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమ కృషితో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు.


