ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పార్ట్ 2లో తెలుగు, హిందీ, సంస్కృతం, వొకేషనల్ విభాగం జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు జరిగాయి. ఆ వివరాలను ఇంటర్మీడియేట్ ప్రాంతీయ పర్యవేణాధికారి ఐ.శారద ఆ వివరాలను తెలిపారు. ఈ పరీక్షలను మొత్తం 20, 875 మంది రాయాల్సి వుండగా 20, 370 మంది హాజరయ్యారు. 505 మంది పరీక్షలు రాయలేకపోయారు. 52 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షించారు. జిల్లాలో ని 38 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్, కస్టోడియన్‌లు, హైపవర్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
218 అర్జీల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను నాణ్యతతో నియమిత సమయంలో పరిష్కరించాలని డీఆర్‌ఓ సీతారామమూర్తి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 200 అర్జీలను స్వీకరించారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌ఓ సీతారామమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు నియోజకవర్గానికి 25 చొప్పున అందజేయాలన్నారు. దివ్యాంగులకు జిల్లాలోని ఆర్టీవో కేంద్రాల వద్ద డ్రైవింగ్ లైసెన్సు మేళా నిర్వహించి చలానా రూ.260. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు 770 రూపాయలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంద్రధనస్సులో ప్రకటించిన ఏడు పథకాలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు ఆదం పకీర్ పాల్గొన్నారు
తరమండల్‌తో ‘నన్నయ’ ఒప్పందం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి తరమండల్ టెక్నాలజీతో ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, తరమండల్ సీఈఓ వినీల్ జడ్సన్ సోమవారం సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. బీటెక్, పీజీ విద్యార్థులకు స్పేస్, డిఫెన్స్, క్వాంటం టెక్నాలజీస్‌లో మైనర్/స్పెషలైజేషన్ కోర్సులు తీసుకురావడానికి ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందని వీసీ తెలిపారు.


