పాడి పశువుల పాలు, రక్తం నమూనాల సేకరణ
కోరుకొండ: స్థానిక నర్సాపురంలో పాడి పశువుల పాలు, రక్తం, ఆహారం నమూనాల సేకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. స్థానికుడు అడ్డాల గణేష్ విక్రయిస్తున్న పాలు కలుషితమవ్వడంతో ఐదుగురు మృతి చెందగా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో గణేష్‌కు చెందిన పాడి పశువుల పాలు, రక్తం నమూనాలు సేకరించారు. నిందితుడు పాలు సేకరిస్తున్న రైతుల పశువుల నుంచి నమూనాలు సేకరించడానికి అధికారులు వచ్చారు. నర్సాపురంలో 43 మంది రైతులకు చెందిన 46 పశువుల నుంచి నమూనాల సేకరణ జరిగింది. రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణనాయక్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఏడీ ప్రభావతి, ఆ శాఖ వైద్యులు, సిబ్బంది 17 మంది సేకరణలో పాల్గొన్నారు. 43 మంది రైతుల రక్త నమూనాలను కూడా కోరుకొండ పీహెచ్‌సీ డాక్టర్ జ్ఞానచంద్ర ఆధ్వర్యంలో సేకరించారు. ఈ నమూనాలను పరీక్షల నిమిత్తం విజయవాడ ల్యాబ్‌లకు పంపుతామని, ఫలితం రెండు రోజుల్లో వస్తుందని ఆర్డీవో కృష్ణనాయక్ విలేకరులకు తెలిపారు.


