ఆస్పత్రులకు నాయకులు, అధికారులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనూరియా బాధితులకు పూర్తి వైద్య ఖర్చుల భారం ప్రభుత్వం భరిస్తుందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి, ధైర్యం కల్పించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. అనూరియా బాధితులు చికిత్స పొందుతున్న బొల్లినేని కిమ్స్, రెయిన్‌బో ఆసుపత్రులకు ఆయన, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో సోమవారం వెళ్లారు. అంతకు ముందు వైఎస్సార్ సీపీ నాయకులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిస్థితిపై ఆరా తీశారు. రాజమహేంద్రవరంలో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించామని, పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కారణాలపై సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలన కొనసాగుతోందన్నారు.


