అంతోటా తెగుళ్లు
● లిల్లీ పంటకు చీడపీడలు
● వాతావరణ మార్పులే కారణం
● సస్యరక్షణ చర్యలు అవశ్యం
పెరవలి: ఒకపక్క చలి.. మరోపక్క వేడి.. ఈ వాతావరణంతో పంటలపై చీడపీడల ప్రభావం అధికమవుతోంది.. ఇలా లిల్లీ పంట కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలు అవశ్యమని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 300 ఎకరాల్లో లిల్లీ తోటల సాగు జరుగుతోంది. ప్రధానంగా పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో సాగు చేస్తున్నారు. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటకు వివిధ తెగుళ్లు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి సోకుతున్నాయి. ఈ తెగుళ్ల నివారణపై కొవ్వూరు ఉద్యాన అధికారి డి.సుధీర్‌కుమార్ వివరించారు. వెంటనే చర్యలు చేపడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఆ వివరాలు ఇలా..
ఆకుమచ్చ తెగులు
లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకూ వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతోంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పిండినల్లి (మీల్‌బగ్)
ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీ మొక్కల దుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వల్ల తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లి పురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం ఉత్తమం.
మొగ్గతొలుచు పురుగులు
మొగ్గతొలిచే పురుగులు పుష్పగుచ్ఛాన్ని ఆశించి గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తామర, పేనుబంక పురుగులు
లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, పూ మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్‌డిజం ఒక గ్రాము లీటరు నీటికి పిచికారీ చేస్తే నివారించవచ్చు. ఇలా క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు.
ఎరువుల యాజమాన్యం
సేంద్రియ ఎరువులతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఈ విధంగా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి ఎకరాకు 60 వేల నుంచి 70 వేల పుష్పగుచ్ఛాలు వచ్చి 3 నుంచి 7 టన్నుల పూల దిగుబడి సాధించవచ్చు.
అంతోటా తెగుళ్లు
అంతోటా తెగుళ్లు
అంతోటా తెగుళ్లు


