భద్రతే బంగారం కాను | - | Sakshi
Sakshi News home page

భద్రతే బంగారం కాను

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 7:34 AM

భద్రత

భద్రతే బంగారం కాను

ఆభరణాలు ధరించాలంటే హడల్‌

వెంటాడుతున్న దొంగల భయం

లాకర్లలో భద్రపరుచుకుంటున్న వైనం

రాయవరం: ప్రస్తుతం భద్రత బంగారానికి ఎంతో అవసరమైంది.. పసిడి ధరలు రోజురోజుకూ కొండెక్కడంతో దొంగతనాల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో రూ.లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆభరణాలను లాకర్లలో భద్రపరుచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.. ఇటీవల జరుగుతున్న ఘటనలే అందుకు ఉదాహరణ.

ఇటీవల రాయవరంలో పులగం లకి్‌ష్మ్‌ అనే మహిళ తన షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా, ఆమె మెడలోని 11 కాసుల బంగారం గొలుసును ఐదుగురు యువకులు తెంచుకుని పరారయ్యారు. అలాగే కపిలేశ్వరపురం మండలం వల్లూరులో మానుపాటి గణేష్‌ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి చోరీకి గురయ్యాయి. ఇటువంటి ఘటనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ ధరించలేని పరిస్థితి నెలకొంటుంది.

పసిడి.. ప్రాణాలతో ముడిపడి

హుందాతనం, అందం కోసం మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. అయితే ఇప్పుడు పెరిగిన ధరలు బంగారం ధరించాలంటేనే హడలిపోతున్నారు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు మంగళ సూత్రాలను బంగారంతో చేయించుకుంటారు. ప్రస్తుతం కాసు బరువున్న బంగారు సూత్రాలు రూ.1.20 లక్షలు ఉంది. ఇలా రూ.లక్షలు ఖరీదు చేసి బంగారు నగలు ధరించాలంటేనే భయపడి పోతున్న పరిస్థితి అంతటా నెలకొంది. తరచూ జరుగుతున్న చోరీల భయంతో మహిళలు హడలిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాల్లో వినిపించే చోరీ ఘటనలు ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరించాయి. కొన్నిచోట్ల మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దుండగులు తెంచుకునే ప్రయత్నాల్లో బాధితుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇటీవల రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. రద్దీగా ఉన్న బస్సుల్లోనే కొందరు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే ఒంటరిగా నడిచి వెళ్లే సమయంలో, ఇంటి వాకిలి శుభ్రపర్చడం, ముగ్గులు వేయడం, ప్రయాణ సందర్భంలో, దేవాలయాలు, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు, మోటార్‌ సైకిల్‌పై అజాగ్రత్తగా వెనుక కూర్చున్న సందర్భాల్లో దోపిడీలు జరుగుతున్నాయి.

అటువైపు చూడాలంటేనే..

పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం షాపు మెట్లెక్కడానికి జంకుతున్నారు. ఒక కాసు బంగారం కొనాలంటే పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ఽబంగారం, వెండి ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చోరీల నేపథ్యంలో అతివలు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను సొంత బీరువాలకు పరిమితం చేయడం.. లేదంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం చేస్తున్నారు. లాకర్లలో ఉన్న బంగారు ఆభరణాలకు బదులుగా ఇమిటేషన్‌ జ్యూయలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏడాది వారెంటీతో ఇప్పుడు మార్కెట్లో వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలు బంగారం స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. మహిళలు రూ.లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు భద్రంగా దాచుకుంటూ తమ నగలనే పోలిన ఇమిటేషన్‌ జ్యూయలరీ ఆభరణాలను వాడుతున్నారు.

వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం

ఆభరణాలు ధరించి ఆడంబరంగా ఉండాలనుకునే ఆలోచన విరమించుకోవాల్సిన పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయి. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగతనాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

–చింతా స్వప్న, గృహిణి, అనపర్తి

ఈజీ మనీకి అలవాటు పడి

బంగారం ధరలు పెరగడం ఒక కారణమైతే, చాలా మంది యువకులు ఈజీ మనీకి, చెడు వ్యసనాలకు బానిసై చోరీల బాట పడుతున్నారు. చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆభరణాలు ధరించడం ప్రాణాంతకమవుతున్న పరిస్థితి ఏర్పడింది.

–గరగ సీతాదేవి, ఉపాధ్యాయురాలు,

సోమేశ్వరం, రాయవరం మండలం

తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెలవులకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌)ను సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.

– బి.విద్య, డీఎస్పీ,

ఈస్ట్‌జోన్‌, రాజమహేంద్రవరం

అంతకంతకూ పెరిగి..

నాలుగైదు నెలల వ్యవధిలో బంగారం ధరలు 60 శాతం వరకూ పెరిగాయి. బంగారు ఎప్పుడు పెరుగుతుందో.. ఎంత మేర పెరుగుతుందో.. ఎప్పుడు దిగుతుందో తెలియని అయోమయ మార్కెట్‌లో ఉంది. కాసు బంగారం ధర గతేడాది సెప్టెంబర్‌లో రూ.80 వేలు ఉంటే, ఇప్పుడు రూ.1.20 లక్షలకు చేరింది. నెల రోజులకు ముందు కాసు ధర రూ.1.33 లక్షలకు చేరగా మళ్లీ ఇప్పుడు కొంతమేర తగ్గింది.

భద్రతే బంగారం కాను 1
1/4

భద్రతే బంగారం కాను

భద్రతే బంగారం కాను 2
2/4

భద్రతే బంగారం కాను

భద్రతే బంగారం కాను 3
3/4

భద్రతే బంగారం కాను

భద్రతే బంగారం కాను 4
4/4

భద్రతే బంగారం కాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement