నర్సింగ్‌ పరీక్షల్లో అవకతవకలపై విచారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ పరీక్షల్లో అవకతవకలపై విచారణకు చర్యలు

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 7:34 AM

నర్సింగ్‌ పరీక్షల్లో అవకతవకలపై విచారణకు చర్యలు

నర్సింగ్‌ పరీక్షల్లో అవకతవకలపై విచారణకు చర్యలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు

‘సాక్షి’ కథనానికి స్పందన

కాకినాడ క్రైం: రాజమహేంద్రవరంలో ఈ నెల 9 నుంచి నిర్వహించిన జీఎన్‌ఎం నర్సింగ్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ చేయించారనే ఆరోపణల నేపథ్యంలో 12న ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్‌’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు, రాష్ట్ర డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌ గంభీర లోతైన విచారణకు ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సరెళ్ల లావణ్యకుమారి ఆధ్వర్యంలో ఆర్‌ఎంసీ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మకం మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్‌ నూకతోటి శ్రీధర్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని విచారణకు నియమించారు. ఈ నెల 27న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ నిర్వహించాలని సూచించారు. ఓఎస్‌డీల హోదాల్లో చీఫ్‌ ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన కాకినాడ జీజీహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ట్యూటర్‌ సుజాత, ఒంగోలు స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ట్యూటర్‌ మాధవీలతలను విచారించేందుకు అధికారులు 50 ప్రశ్నలను సిద్ధం చేశారు. వీరితో పాటు ఇతర సిబ్బందిని విచారణలో భాగం చేయనున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా వ్యవహరించిన రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌కి తెలియకుండా, నర్సింగ్‌ పరీక్షలు నిర్వహించిన గత అనుభవాన్ని అవకాశంగా మలుచుకుని ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలతో కాపీయింగ్‌ కోసం ఖరీదు కట్టడం, అందుకు మంతనాలు చేయడం తుదకు వారితో పరీక్షలకు సరిగ్గా మూడు రోజుల ముందు ఈ నెల 6న రహస్య సమావేశం నిర్వహించిన తంతు ఆధారాలతో సహా రాష్ట్ర ఉన్నతాఽధికారులకు చేరింది. వసూళ్లు, కాపీయింగ్‌ వ్యవహారం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. ఈ నేపథ్యంలో ఓఎస్‌డీల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించామని డీఎంఈ తెలిపారు. అలాగే, కాకినాడలో నిర్వహించిన నర్సింగ్‌ పరీక్షల్లో తొలి రోజు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం, చీఫ్‌ ఇన్విజిలేటర్‌ హోదాలో రాష్ట్రం మొత్తం నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లను నియమిస్తే ఒక్క కాకినాడలోనే ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా అడ్మినిస్ట్రేటర్‌ని నియమించడం వివాదాస్పదమైంది. ఈ అంశాలపై కూడా వివరణ కోరుతూ డీఎంఈ ఆదేశాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement