సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా సమ్మె చేస్తున్న సహకార ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.సత్తిబాబు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి వీరి డిమాండ్లను పరిష్కరించి సమ్మెను తొందరగా విరమింపజేయాలని సూచించారు. సమ్మె కారణంగా సహకార ఉద్యోగులు విధులు నిర్వర్తించక, సహకార సంఘాలు తెరుచుకోక అన్నదాతలు అవస్థఽలు పడుతున్నారని సత్తిబాబు గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన జీఓ నంబరు 36ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అన్నారు. రైతు పభుత్వం అని చెప్పుకొనే కూటమి ప్రభు త్వం సహకార ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సహకార ఉద్యోగుల సమ్మెకు రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత, సంఘటిత కార్మికుల సంఘీభావం కూడగడతామని సత్తిబాబు అన్నారు.
రోడ్డుపై పడి వ్యక్తి మృతి
నల్లజర్ల: ఫిట్స్ కారణంగా రోడ్డుపై పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముసుళ్లగుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నూజివీడు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన పెద్దబోయిన గంగరాజు (44) గొర్రెలు కొనుగోలు చేయడానికి శనివారం ముసుళ్లగుంట గ్రామానికి వచ్చాడు. ఆదివారం ఆ గ్రామ వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఫిట్స్ రావడంతో రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు వెంకటకిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆంజనేయబాబు తెలిపారు.


