నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయాల నుంచి హాజరవుతారని ఆమె వివరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చన్నారు.
అకాల వర్షం
దేవరపల్లి: మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి అకాల వర్షం కురిసింది. సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు బలమైన ఈదురుగాలులతో కూడిని వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు పంటలు నేలకొరిగినట్టు సమాచారం. రోడ్లపై వర్షపు నీరు చేరింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవరపల్లి, సంగాయగూడెం, చిన్నాయగూడెం, బందపురం, దుద్దుకూరు, చాగల్లు, సీతానగరం, పోలవరం జిల్లా దేవీపట్నం తదితర మండలాల్లో వర్షం కురిసింది.
తోటలమ్మకు రూ.30 లక్షలతో మకర తోరణాలు
అమలాపురం రూరల్: మండలంలోని పాలగుమ్మి గ్రామదేవత తోటలమ్మ అమ్మ వారికి రూ.30 లక్షల విలువైన 6 కిలోల వెండి తొడుగు, మకరతోరణం, 111 కిలోల పంచలోహ మకరతోరణాలను దాత సమర్పించారు. గ్రామానికి చెందిన బొక్కా వెంకటరత్నం (తాత), సత్యనారాయణ (తండ్రి)పేరున కుమారుడు బొక్కా రవి కుమార్ అమ్మవారికి మకరతోరణాలు చేయించారు. తోటలమ్మ అమ్మవారికి ఎంత చేయించినా తక్కువే అని భావోద్వేగానికి గురై ఆభరణాలు సమర్పించారు.
ఏకదంతుని దర్శనానికి
తండోపతండాలు
అయినవిల్లి: భక్తుల కోర్కెలు తీర్చే అయినవిల్లి గణపయ్యను దర్శించేందుకు ఆదివారం భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. ఆర్చకులు స్వామి వారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. ఓ చిన్నారికి నామకరణ, ఎనిమిది మందికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరికి తులాభారం, 52 మందికి అన్నప్రాశన, 58 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 5218 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించినట్లు ఈఓ, ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
బాలాజీకి రూ.2.14 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దర్శనానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. గోవిందా గోవిందా అంటూ బాలబాలాజీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,14,453 ఆదాయం వచ్చింది. 6,300 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 2,100 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.88,463 విరాళాలుగా అందించారు. వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, ఈఓ ఎం.రాంబాబురెడ్డి పాల్గొన్నారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్


