బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
మాజీ హోం మంత్రి తానేటి వనిత
దేవరపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆరోపించారు. మండలం యాదవోలులో నాలుగేళ్ల బాలికలపై 70 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన తెలిసిందే. విషయం తెలుసుకున్న వనిత, వైఎస్సార్ సీపీ నాయకులు ఆదివారం బాధిత బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. బాఽధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చి బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. ఆమె మాట్లాడుతూ వయసుకు మించిన దుర్మార్గపు ఆలోచన వృద్ధుడికి రావడం బాధాకరమని అన్నారు. ఇందుకు కారణం రాష్ట్రంలో వీధికో ఐదారు మద్యం బెల్టు దుకాణాలు, గంజాయి లభ్యమవడం అన్నారు. స్వలాభం కోసం, సంపాదన కోసం కూటమి నేతలు ఇటువంటి వ్యాపారాలు చేస్తూ ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నారన్నారు. పోలీసులు ఏదైనా చర్యలు తీసుకుందామనుకున్నా ప్రభుత్వం చేయనీయడం లేదని పేర్కొన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు చెప్పినట్టు నడుచుకోవలసిన పరిస్థితి పోలీసులది అని వనిత పేర్కొన్నారు. బాలికను ప్రభుత్వం ఆదుకుని పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సున్నం వర ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు కూచిపూడి సతీష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలికే నాగ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి గడా జగదీష్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆచంట అనసూయ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గడా రాంబాబు, ఆరేటి సూర్యనారాయణ పాల్గొన్నారు.


