‘చలో విజయవాడ’ జయప్రదం చేయాలి
రంగంపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు మేనిఫెస్టో సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఈ నెల 25న నిర్వహిస్తున్న ‘చలో విజయవాడ’కు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని ఎస్‌టీయూ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీసీ జాకబ్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన డిమాండ్లుగా ఉన్న 12వ వేతన సంఘాన్ని నియమించాలని, వేతన సవరణ సంఘం రిపోర్టు వచ్చే వరకు 30% మధ్యంతర భృతి ఇవ్వాలనారు.
కంట్రిబ్యూటరీ పెన్షన్, గ్యారెంటీ పెన్షన్ పథకాలను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ సౌలభ్యాలు విడుదల చేయాలని కోరారు. అలాగే ఎంటీఎస్, సాంఘిక సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు.
2025లో బదిలీ కోరుకున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, నాలుగు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్‌ను వెంటనే విడుదల చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా రిఫరల్ ఆస్పత్రులలో నగదు రహిత ట్రీట్మెంట్ ఇవ్వాలని వారు తెలిపారు.


