‘తిరుమల’లో అవగాహన సదస్సు విజయవంతం
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం తిరుమల విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం 5, 6, 7, 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్, నీట్‌లపై అవగాహన సదస్సు జరిగింది. దీనికి సుమారు 15 వేల మంది హాజరైనట్లు తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ/ఎన్‌ఐటీ/ఐఐఐటీ/బిట్స్‌లలో 54 వేల సీట్లకు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. ఈ పరీక్షల (జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్)లో సగటున 28 మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందన్నారు. అదే తిరుమలలో ప్రతి ఐదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా మెడికల్ సీట్లు 1,18,000 ఉంటే 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారన్నారు. ఈ పరీక్షలో సగటున 20 మంది పరీక్ష రాస్తే కేవలం ఒకరికి మాత్రమే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందని అన్నారు. పిల్లలకు శారీరక శ్రమ లేకపోవడంతో వారు ఎక్కువ సేపు ఫోన్లలోనే గేమ్‌లు ఆడటం, సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారన్నారు. దీని నుంచి బయట పడాలంటే పిల్లలను స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు దూరంగా ఉంచాలన్నారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రతి తల్లి తమ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేయాలని తెలిపారు. పలువురు తల్లిదండ్రులు తిరుమల విద్యాసంస్థతో వారికున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సులో అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తిరుమల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
వ్యక్తి దుర్మరణం
తొండంగి: మండలంలోని గోపాలపట్నం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన అల్లూరి చిన్నబాబు (54) సెలూన్ నిర్వహిస్తూ శుభకార్యాల్లో బ్యాండ్‌మేళాలు వాయిస్తూ ఉండేవాడు. శనివారం కోటనందూరు మండలం కేఈ చిన్నాయపాలెంలో బిక్కవోలు బ్యాండ్ మేళంతో జాతరకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారు జామున స్వగ్రామానికి వస్తుండగా, గోపాలపట్నం హైవేపై అండర్ పాస్ బ్రిడ్డి వద్ద దిగాడు. తొండంగి రహదారి మీదుగా ఎ.కొత్తపల్లి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అపస్మారక స్థితికి చేరిన అతన్ని 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ పాండురంగారావు తెలిపారు.


