
దొంగల ముఠా అరెస్ట్
గండేపల్లి: ట్రాక్టర్ ట్రక్కులను చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం ఆ వివరాలు వెల్లడించారు. ధవళేశ్వరం సమీపంలోని రాజవోలుకు చెందిన బి రత్నరాజు, కడియం మండలం జేగురుపాడుకు చెందిన ఎం శ్రీను, పి.తరుణ్, ఎం.వినయ్ కుమార్ ట్రాక్టర్ (ఇంజిన్)ను తీసుకుని వచ్చి రైతుల పొలాల వద్ద ఉంచిన ట్రక్కులను దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాళ్లూరులో ట్రక్కును చోరీ చేస్తుండగా ఎస్సై యూవీ శివ నాగబాబు తన సిబ్బందితో దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి నేరాలకు ఉపయోగించే ట్రాక్టర్ (ఇంజిన్), మోటార్ సైకిల్, రూ. 5 లక్షల విలువైన ట్రక్కులు, రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పెద్దాపురం కోర్టుకు తరలించగా సెప్టెంబర్ 12 వరకు రిమాండ్ విధించారన్నారు. గండేపల్లి మండలం తాళ్లూరు, మురారి, అనకాపల్లి జిల్లా నాతవరం, తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలో ట్రక్కులను వీరు దొంగిలించారు.