
పచ్చదనానికి పురస్కారం
● పాఠశాలలకు స్టార్ రేటింగ్
● కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం
● జిల్లా నుంచి 8 పాఠశాలలకు అవకాశం
● జాతీయస్థాయికి ఎంపికై తే
రూ.లక్ష ప్రోత్సాహకం
రాయవరం: మానవాళి మనుగడ సాగించేందుకు పచ్చదనం, పరిశుభ్రత అనేవి చాలా అవసరం. వీటిని ఎవరికి వారు కాపాడుకుంటూ భావితరాలకు అందజేయాలి. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. మొక్కలను పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అలాగే పరిశుభ్రత కారణంగా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పాఠశాల స్థాయి నుంచి అభివృద్ధి చేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్య ఇచ్చే పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన పాఠశాలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు.
ఐదు స్టార్ల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మార్పులు చేసి ఇప్పుడు స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) 2025–26 పేరిట బడులకు రేటింగ్ ఇవ్వనుంది. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారంతో పాటు రూ.లక్ష ప్రోత్సాహకం అందించనుంది. మొత్తం ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించి 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించనున్నారు. ప్రతి జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు.
ఆరు అంశాలు.. 60 సూచికలు
ఆరు అంశాల ఆధారంగా పాఠశాలలకు రేటింగ్ ఇస్తారు. పాఠశాలలో నీటి సదుపాయం, వాన నీటి సంరక్షణ, వినియోగం, మరుగుదొడ్డి సౌకర్యాలు, విద్యార్థులకు సబ్బుతో హ్యాండ్ వాష్, వ్యర్థాల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, విద్యుత్ సదుపాయం, బిహేవియర్ ఛేంజింగ్, కెపాసిటీ నిర్మాణం, మిషన్ లైఫ్ యాక్టివిటీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు.
ప్రతి పాఠశాల
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఎన్‌హెచ్‌వీఆర్ యాప్‌లో ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌కు ఆరు అంశాల ప్రాతిపదికగా దరఖాస్తు చేసుకోవాలి. స్వచ్ఛ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి.
బీవీవీ సుబ్రహ్మణ్యం,
సీఎంవో, సమగ్ర శిక్షా, అమలాపురం
అవగాహన కల్పించాం
స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) 2025–26కు ప్రతి పాఠశాల అర్హత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. దీనిపై ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాం. మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షణ చేసి, ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలి.
– జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
జిల్లాలో 2,031 పాఠశాలలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో వివిధ కేటగిరిలకు చెందిన 2,031 పాఠశాలలున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రతి సూచికకు సంబంధించిన ఆధారాలు అప్‌లోడ్ చేయాలి. పరిశీలకులు స్వయంగా పరిశీలించి ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇస్తారు. ఉత్తమ స్కోర్ సాధించిన బడులకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు ఇస్తారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో గరిష్టంగా 20 పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందజేస్తారు. సంబంధిత హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లకు దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.

పచ్చదనానికి పురస్కారం

పచ్చదనానికి పురస్కారం