
ఎరువు.. ధరవు!
పెరవలిలో ఆకుమడికి ఎరువులు వేస్తున్న రైతు
● అన్నదాతపై తప్పని ధరల భారం
● 50 కిలోల బస్తాపై
రూ.320 వరకు పెంపు
● కూటమి పాలనలో
రెండు సార్లు పెంచిన వైనం
● ఐదేళ్ల జగనన్న పాలనలో
అన్నింటా అండగా నిలచిన ప్రభుత్వం
పెరవలి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం ఆ బాధ్యత నెరవేర్చకపోగా అదనపు భారాలు మోపుతోంది. ప్రకృతికి ఎదురీది వ్యవసాయం చేస్తున్న రైతులను సంక్షోభంలోకి నెడుతోంన్నది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై ఎరువుల రూపంలోనూ అధిక భారాన్ని మోపుతోంది. కూటమి పాలన ఏడాది కాలంలోనే రెండు సార్లు ఎరువుల ధరలు పెంచటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎరువుల ధరల పెరగటంతో రైతులు వ్యవసాయం చేయాలా లేదా వదలేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయంలో కూలీల దగ్గర నుంచి, అన్ని ఖర్చులు పెరిగిపోవటం, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు విలవిలలాడుతున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు మిగులు లేక, ఒకొక్క సారి పెట్టుబడి సైతం కోల్పోతున్న రైతులకు అండగా నిలబడవలసిన పాలకులు ఏమీ పట్టనట్లు వ్యవహరించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో సాగు ఇలా
జిల్లాలో 76,941 హెక్టార్లలో ఖరీఫ్ కాలంలో వరి సాగు చేస్తుండగా, 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిలో కొబ్బరి 8,050 హెక్టార్లు, కోకో 5517 హెక్టార్లు, పామాయిల్ 20,219 హెక్టార్లు, అరటి 7,500 హెక్టార్లు, మామిడి 5,500 హెక్టార్లు, మొక్కజొన్న 1,500 హెక్టార్లు, కూరగాయ పంటలు 4,125 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పొగాకు, బొప్పాయి, జామ, బత్తాయి, జీడిమామిడి వంటి పంటలు సాగు చేస్తున్నారు.
పెరుగుతున్న ఎరువుల వినియోగం
ఏటా ఖరీప్‌తో పాటు రబీలోను పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువుల వినియోగం పెరిగిపోయింది. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగం పెరగడంతో పెట్టుబడి కూడ పెరిగింది. దీని ఫలితంగా దిగుబడి ఎంత వచ్చినా రైతులకు పెద్దగా ప్రయోజనం కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచింది. జిల్లాలో ప్రతి మండలంలో సరాసరిన ఏడాదిలో సుమారు 4,500 టన్నుల నుంచి 15 వేల టన్నుల వరకు ఎరువులను వినియోగిస్తారని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.4 వేల వరకు ఎరువుల ధరలు పెరగటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సన్న, చిన్నకారు రైతులు ఎరువుల దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. దీనితో పంటలు వచ్చిన తరువాత అసలు, వడ్డీతో కలిపి అప్పు తీర్చాల్సిరావడంతో వచ్చిన ఆదాయం ఎరువుల దుకాణాల్లో బాకీలు తీర్చడానికే సరిపోతోందని రైతులు వాపోతున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో అన్నీ అందుబాటులో..
వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఎరువుల ధరలు పెంచలేదు సరికదా రైతులకు అన్నీ అందుబాటులో ఉంచారు. పెట్టుబడి సాయం కూడ పంట వేసే ముందే అన్నదాతకు అందించి వారిని అన్ని విధాలా ఆదుకున్నారు. అంతే కాకుండా ప్రకృతి వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట కాలంలోనే నష్ట పరిహారం అందించేవారు. ఇవే కాకుండా ఎరువులు, విత్తనాలు అన్ని ఆర్బీకేలో అందుబాటులో ఉంచేవారు.
పొంతన లేని నేతల మాటలు
జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువులు అవసరానికి సరిపడా లభించటం లేదు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా అధిక ధరలకు విక్రయించడంతో రైతులు దిక్కులేక అధిక ధరలకు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఒకసారి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువుల కోటాను సకాలంలో పంపించటం లేదని మరోసారి ప్రకటనలు గుప్పించటం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ఎరువుల కోటాను రప్పించుకోవటంలో కూటమి సర్కారు విఫలమైందని చెప్పవచ్చు. ఎరువుల ధరలను ఆయా సంస్థలు ఇష్టానుసారం పెంచుకుంటూ పోతున్నా కూటమి సర్కార్ కనీస చర్యలు తీసుకోవటం లేదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం సమావేశాలు ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎరువుల కంపెనీలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవటం వల్లే ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
ఎరువులు రూపాయలలో..
50కిలోల పాత ధర కొత్త ధర పెరిగినది
పొటాష్ 1,535 1800 265
10–26–26 1,470 1800 330
12–32–169 1,470 1720 250
16–16–16 1,450 1600 150
24–24–0 1,700 1800 100
20–20–13 1,300 1400 100
14–35–14 1,700 1800 100
15–15–15 1,450 1600 150
సూపర్ ఫాస్పేట్ 570 650 80
బాబు పాలనలో ఎన్నో పాట్లు..
2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ఎరువుల ధరలు పెంచితే, ఈ ఏడాది పాలనలోనే రెండు సార్లు పెంచారు. ఈయన పాలనలో రైతులు పడేపాట్లు వర్ణనాతీతం. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రైతులు ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించటమే కాకుండా ఐదుగురు ప్రాణాలు బలిగొన్నారు. అంతే కాకుండా వ్యవసాయం దండగ అంటూ నీతి వాక్యాలు వల్లించారు. ఇప్పుడు కూడా రైతులపై సవతి తల్లి ప్రేమ కురిపించమే కానీ నిజంగా రైతులను ఆదుకునే పనులు చేయటం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
రైతుకు అదనపు భారం
కూటమి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎరువుల ధర లు పెంచితే మేము వ్యవసా యం ఎలా చేయాలి? ఇప్పటికే వ్యవసాయంలో పెట్టుబడి ఎక్కువై గిట్టుబాటు లభించటం లేదు. ఈ పెంచిన ఎరువుల ధరల వల్ల ప్రతి రైతుకు ఒక ఎకరానికి రూ.3 వేల నుండి రూ.5 వేల అదనపు భారం పడుతోంది.
– పిల్లా శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి అగ్రహారం
నడ్డివిరుస్తున్న ‘కూటమి’
కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదు. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతు నడ్డివిరుస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. రైతులను ఆదుకోలేకపోయినా కనీసం పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ, ఎరువుల ధరలు పెంచకుండా చూస్తే సరిపోతుంది.
– వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు
అన్నదాతతో ఆడుకోవద్దు
పంటకు పెట్టుబడి ఎక్కువై మిగులు కనిపించటం లేదు. పెట్టుబడి వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. దానికి తోడు ఎరువులు ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచి రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి కానీ ఆడుకోకూడదు.
– లొల్ల నాగేశ్వరరావు, రైతు, పెరవలి

ఎరువు.. ధరవు!

ఎరువు.. ధరవు!

ఎరువు.. ధరవు!

ఎరువు.. ధరవు!