
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
చాగల్లు: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానా లను గెలుపొందిందని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. గు రువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసిందని, ఏజెంట్ల కు, ఓటర్లకు స్వేచ్ఛలేని పోలింగ్ జరిగిందని, ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయని అన్నారు. పోలింగ్‌కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లలో గందరగోళం సృష్టించారని అన్నారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా? వైఎస్సార్ సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా? పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు? హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్‌లో మార్పు లేదని అన్నారు. కనీసం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కూడా ఓటు వేయలేకపోయారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.
వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజీని బయట పెట్టాలి
పోలింగ్‌లో జరిగిన అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలబడిందని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిందని అన్నారు. కలెక్టర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారని వెంకట్రావు విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల వద్ద కనీసం ఎక్కడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అన్నారు. యూనిఫామ్ వేసుకున్న పోలీసులు ఉన్నది ప్రజలను రక్షించడానికి కాదని పాలకులు చెప్పింది చేయడం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం, ప్రతిపక్షాన్ని కట్టడి చేయడం.. తమకు ఆయుధం ఇచ్చింది, ప్రజల రక్షణ కోసం కాకుండా, విపక్ష కార్యకర్తలను కాల్చడానికి అన్నట్లుగా ఎన్నికల్లో ఒక డీఎస్పీ అత్యంత అహంకార పూరితంగా పార్టీ కార్యకర్తలను బెదిరించడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ
ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
కళ్లుండీ చూడలేని ఎన్నికల కమిషన్, పోలీసులు
వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజీని బయట పెట్టాలి
వైఎస్సార్ సీపీ కొవ్వూరు ఇన్‌చార్జి
తలారి వెంకట్రావు