
అధికారులూ.. అప్రమత్తం
● కార్యాలయాల్లో అందుబాటులో ఉండండి
● కలెక్టర్ ప్రశాంతి ఆదేశం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అధిక వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జేసీ ఎస్.చిన్నరాముడు, డీఆర్‌ఓ సీతారామమూర్తితో కలిసి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. రానున్న నాలుగైదు రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టకుండా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, రోడ్లు–భవనాలు, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, పౌర సరఫరాల శాఖలు తమ పరిధిలో నష్టపోయిన వనరులను సమీక్షించి, కచ్చితమైన గణాంకాలతో 24 గంటల్లో కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా తక్షణ సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ఆరోగ్య, పారిశుధ్య చర్యలు
ఆరోగ్య శాఖ అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అన్ని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి, తగిన వైద్య సిబ్బంది విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో 24 గంటల కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాద సూచనలు గమనించిన వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో వర్షపాతం 957.8 మిల్లీ మీటర్లు
దేవరపల్లి: జిల్లాలోని 18 మండలాల్లో గురువారం ఉదయం 8.30 గంటల వరకు 957.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 50.4 మిల్లీ మీటర్లు కాగా, ఉండ్రాజవరం మండలంలో అత్యధికంగా 180 మిల్లీ మీటర్లు, పెరవలి మండలంలో 170.6 మిల్లీ మీటర్లు, నల్లజర్ల మండలంలో 120 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన మండలాలను పరిశీలిస్తే అనపర్తిలో 55.2, రాజమహేంద్రవరం రూరల్‌లో 52.8, రాజమహేంద్రవరం అర్బన్‌లో 45.6, బిక్కవోలులో 45.4, కోరుకొండలో 43.4, కడియంలో 37.4, గోకవరంలో 33.6, చాగల్లులో 28, దేవరపల్లిలో 25.4, రంగంపేటలో 24.6, తాళ్లపూడిలో 15, సీతానగరంలో 14.6, కొవ్వూరులో 13.8, రాజానగరం 10.2, గోపాలపురం మండలంలో 8.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.