
పంద్రాగస్టు పరేడ్ రిహార్సల్స్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్‌ను ఎస్పీ డి.నరసింహాకిశోర్ గురువారం పరిశీలించారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించి సాయుధ పోలీస్ బలగాల పరేడ్‌ను తిలకించారు. పరేడ్ బాగుందని, ఇదే స్ఫూర్తితో శుక్రవారం జరిగే వేడుకలను విజయవంతం చేయాలన్నారు. జెండా వందనానికి వచ్చే ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలకు సరైన సదుపాయాలు, బందోబస్తు, భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరినీ డీఎంఎండీ ద్వారా తనిఖీ చేసి పంపాలని, వాహనాల పార్కింగ్ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఎల్.చెంచిరెడ్డి, ఏఆర్ డీఎస్పీ రవికుమార్, ఆర్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తయినట్టు జేసీ ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. వర్షం ఇబ్బంది పెడితే సుబ్రహ్మణ్యం మైదానం వద్ద వేడుకలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆర్‌ఎంసీ అధికారులు, రెవెన్యూ, పోలీసు, సాంస్కృతిక సమన్వయ శాఖల అధికారులతో తగిన చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 14 శాఖల శకటాలు, స్టాల్స్ ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, ఆర్‌ఎంసీ ఏడీసీ పీవీ రామలింగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి, జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాసరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.
రత్నగిరి కిటకిట
● స్వామివారిని దర్శించిన
40 వేల మంది భక్తులు
● 2,500 వ్రతాల నిర్వహణ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధువులు సత్యదేవుని వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించారు. పెళ్లిబృందాలు తమ వాహనాలను ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ఉదయం పది గంటల వరకు ఘాట్‌రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. తరువాత రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. కాగా, గురువారం స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు.
నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు
కాగా, గురువారం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల నిజరూప దర్శనంతో భక్తులు పులకించారు. ప్రతి సోమవారం ముత్యాల కవచాలతో, గురువారం ఏ విధమైన అలంకరణ లేకుండా నిజరూప దర్శనంతో అలంకరిస్తున్న విషయం తెలిసిందే.

పంద్రాగస్టు పరేడ్ రిహార్సల్స్

పంద్రాగస్టు పరేడ్ రిహార్సల్స్