
మది నిండా మువ్వన్నెల జెండా!
కంబాలచెరువు: స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశం కోసం పోరాడేలా మన ఆలోచన ఉండాలన్నారు. దేశభక్తి అభ్యున్నతికి, ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుంచి నందం గనిరాజు సెంటర్, కంబాలచెరువు మీదుగా వెళ్లి తిరిగి కళాశాలకు చేరింది. ర్యాలీలో 57 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో విద్యార్థులు దేశభక్తితో కూడిన నినాదాలు చేశారు. ర్యాలీలో 4,500 మంది విద్యార్థులు, 200 మంది ఉపాధ్యాయులు, 50 మంది అధ్యాపకేతర సిబ్బంది, యూత్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ జి.రవితేజ, కో ఆర్డినేటర్ సుభాషిణీదేవి, మురళీకృష్ణ, ఎన్‌సీసీ కో ఆర్డినేటర్ అనూష పాల్గొన్నారు.