
కొబ్బరి చెక్క.. సిరులు పక్కా
● రత్నగిరిపై వేలం పాట
● నెలకు రూ.19.05 లక్షలకు ఖరారు
● సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో కొబ్బరి ముక్కల వేలం రికార్డు ధరకు ఖరారైంది. గతంలో నెలకు రూ.7.26 లక్షలు ఉన్న వేలం ఈ సారి రూ.19.05 లక్షలు వెళ్లింది. అంటే దాదాపు మూడురెట్లు పెరిగి సత్యదేవునికి సిరులు కురిపించింది. అన్నవరం దేవస్థానం చరిత్రలో ఒక వేలం ఇంత ఎక్కువ మొత్తానికి వెళ్లడం ఇదే ప్రథమం. రెండేళ్ల కాలపరిమితికి గాను గురువారం ఈ వేలం జరిగింది. దేవస్థానంలో వ్రతాలాచరించే భక్తుల నుంచి సేకరించే కొబ్బరి చెక్కలతో పాటు రావిచెట్టు వద్ద, వివిధ ఆలయాల్లో భక్తులు కొట్టే కొబ్బరి చెక్కలను పోగుచేసుకునేందుకు గతంలో విడివిడిగా వేలం నిర్వహించేవారు. అయితే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆ రెండింటికీ కలిపి గురువారం ఒకే వేలం జరిపారు. ఈ కార్యక్రమంలో నలుగురు పాటదారులు పాల్గొన్నారు. గతంలో రెండు వేలం పాటల్లో నెలకు రూ.7.26 లక్షలు ఆదాయం వచ్చింది. గురువారం జరిగిన వేలంపాటలో రికార్డు స్థాయిలో రూ.19.05 లక్షలకు వెళ్లింది. దీంతో దేవస్థానానికి తొలి ఏడాది రూ.2.28 కోట్లు, రెండో ఏడాది పది శాతం పెరుగుదలతో సుమారు రూ. 2.51 కోట్లు ఆదాయం రానుంది. అంటే రెండేళ్లకు రూ.4.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. అలాగే బుకింగ్ ఆఫీసు ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్‌లోని మూడో నంబర్ షాపులో కొబ్బరి కాయలు, అరటిపండ్లు విక్రయించేందుకు గాను గతంలో నెలకు రూ.2.33 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ వేలం పాట నెలకు రూ.3.78 లక్షలకు వెళ్లింది. ప్రకాష్ సదన్ సత్రం వెనుక మినీ క్యాంటీన్ వేలం నెలకు రూ.2.82 లక్షలకు వేలం ఖరారైంది. దేవస్థానం ఈఈ నూకరత్నం, ఏఈఓ ఎల్ శ్రీనివాస్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకట రమణ తదితరులు వేలం నిర్వహించారు.