
విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి సంసిద్ధత
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ పశ్చిమ రాజగోపురం ముందు భారీ విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రవికుమార్ దేవస్థానానికి మంగళవారం లేఖ పంపించారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో 125 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పున 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెన్‌సిల్ షెడ్డు నిర్మించేందుకు ఆ సంస్ధ ముందుకొచ్చింది. సుమారు 3 వేల మంది భక్తులు ఈ షెడ్డులో సేద తీరే అవకాశం ఉంది. రాత్రి వేళ కూడా విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. వసతి గదుల కోసం భక్తుల నుంచి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ షెడ్డులో భక్తుల కోసం వ్రతాలు, దర్శనం, ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. పెద్దపెద్ద హెలికాప్టర్ ఫ్యాన్లు కూడా అమర్చనున్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకువెళ్లి, షెడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నవరం దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ పశ్చిమ రాజగోపురం ఎదురుగా నిలువ నీడ లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో అక్కడి చెట్ల కిందనే తలదాచుకోవల్సిన దుస్థితి. అదే వర్షాకాలమైతే తడిసి ముద్దవుతున్నారు. షెడ్డు నిర్మాణం జరిగితే భక్తులకు ఈ బాధలు తప్పుతాయి.
22న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సత్యదేవుని సన్నిధిలో సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.