చోరీ సొత్తుతో సహా నిందితుడి అరెస్ట్
● రూ.10 లక్షల నగదు రికవరీ
● 24 గంటల్లోనే కేసును ఛేదించిన
పోలీసులు
అన్నవరం: స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుడి బ్యాగ్ కోసి రూ.10 లక్షలు అపహరించిన నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్‌పీ డీ శ్రీహరి రాజు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన బోడపాటి నాగేశ్వరరావుకు తునిలో ఇంటి స్థలం ఉంది. దానిని ఆయన తన స్నేహితుడు భానుప్రకాష్ ద్వారా రూ.20 లక్షలకు ఇటీవల విక్రయించారు. ఆ మేరకు రూ.10 లక్షల నగదు, మరో రూ.10 లక్షల చెక్కును బ్యాగులో పెట్టుకుని సోమవారం ఉదయం తునిలో ఆర్టీసీ బస్సు ఎక్కి అన్నవరం బస్‌కాంప్లెక్స్‌లో దిగారు. బస్‌కాంప్లెక్స్‌లో గుంటూరు బస్సు కోసం వేచి చూస్తుండగా మరో వ్యక్తి ప్రయాణికుడిలా నటిస్తూ ఆయనతో మాటలు కలిపారు. అనంతరం ఆయనను మభ్యపెట్టి పదునైన చాకుతో బ్యాగ్ కోసి రూ.పది లక్షల నగదు అపహరించి పారిపోయాడు. మధ్యాహ్నం ఆయన గుంటూరు బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ చూడగా కోసి ఉంది. దీంతో ఆయన కంగారుగా బస్సు దిగి చూడగా బ్యాగ్‌లో రూ.10 లక్షలు లేవు. దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నం అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ కాంప్లెక్స్‌లో తనను మాటల్లో పెట్టిన వ్యక్తే చోరీ చేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్‌పీ శ్రీహరి రాజు, పెద్దాపురం సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ అంకబాబు, ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్‌ఐ శ్రీ హరి బాబు, ఏఎస్సై బలరామ్, హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ బాధితునితో మాట్లాడారు. నేరస్తుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాం సెంటర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి బ్యాగ్ పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతుండగా పొలీసులు అతడిని ప్రశ్నించడంతో ఆ నేరం తానే చేసినట్టు అంగీకరించాడు. అతడిని విశాఖకు చెందిన కంబాల శ్రీనుగా గుర్తించారు. అతని వద్ద గల బ్యాగ్‌లో చోరీ సొత్తు రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్‌పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ జీ బిందుమాధవ్ అభినందించారు.


