సీహెచ్‌ఓల వినూత్న నిరసన
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 21 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) సోమవారం వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సూర్య నమస్కారాలు వేస్తూ, ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి, తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ)/సీహెచ్‌ఓ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, కోత లేకుండా క్రమం తప్పకుండా పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
– రాజమహేంద్రవరం రూరల్


