సంతోషమనిపింఛన్‌ | Sakshi
Sakshi News home page

సంతోషమనిపింఛన్‌

Published Thu, Nov 16 2023 6:14 AM

పెన్షను ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్న వలంటీరు  - Sakshi

మా కష్టాలు తెలుసుకుని..

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా కష్టాలు తెలుసుకుని పెన్షన్‌ పెంచుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూ.2,750 ఇస్తున్నారు. పెన్షన్‌పైనే ఆధారపడే కుటుంబాలకు సంతోషకరం. వచ్చే ఏడాది జనవరి నుంచి పెన్షన్‌ పెంచడం మాలాంటి వారికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

– ఆండ్ర మల్లేశ్వరరావు,

పెన్షన్‌దారుడు, రాయవరం

మాట నిలుపుకున్నారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ పెంచి ఇస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు రూ.250 వంతున పెంచారు. వచ్చే ఏడాది కొత్త సంవత్సరం కానుకగా మరో రూ.250 పెంచుతానని చెప్పడం ఆనందంగా ఉంది. మా వృద్ధుల కష్టాలు తెలుసుకుని ఇంటి వద్దకే పెన్షన్‌ తెచ్చి ఇస్తున్నారు.

– ఆకుల అప్పాయమ్మ,

వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం

రాయవరం: నాలుగున్నరేళ్ల క్రితం ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పెన్షన్‌ దారుల జీవితాలకు భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పెన్షన్‌ సొమ్మును దశలవారీగా పెంచుతూ వచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సామాజిక పెన్షన్‌ సొమ్మును మరో రూ.250 పెంచనున్నారు. తద్వారా పెన్షన్‌ రూ.3వేలకు చేరనుంది. సామాజిక పెన్షన్ల పంపిణీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. గత తెలుగుదేశం పాలనలో ఇచ్చే అరకొర పెన్షన్‌ కోసం పంచాయతీల వద్ద పడిగాపుల కాసేవారు. ఆ పరిస్థితిని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తొలగించింది. ఒకటో తేదీనే పండుటాకులకు ఇంటి వద్దనే పెన్షన్‌ సొమ్మును అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. మీకు నేనున్నాను..అనే భరోసాను సీఎం జగన్‌ చేతల ద్వారా కల్పించారు.

క్రమంగా పెంచుతూ..

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి రూ.1,000 పెన్షన్‌ ఇచ్చేవారు. పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి పెన్షన్‌ను దశల వారీగా రూ.3వేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒకేసారి రూ.2వేలు చేసింది. ఇదిలా ఉంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.2వేల పెన్షన్‌ను 2020 జనవరి నుంచి రూ.2,250కు పెంచారు. అనంతరం 2021 జూన్‌ నుంచి రూ.2,500కు పెంచారు. ఈ ఏడాది జనవరి నుంచి రూ.2,750కు పెంచారు. దీనివలన జిల్లాలో 1.98 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్లకు లబ్ధి చేకూరింది. ఈ పెంపుదల కారణంగా జిల్లాలో ప్రతి నెలా అదనంగా రూ.4.97 కోట్ల భారం పడింది. అయినప్పటికీ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంక్షేమానికే కట్టుబడి ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి సంక్రాంతి కానుకగా రూ.3వేలకు పెంచనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సామాజిక పెన్షన్‌దారుల మోముల్లో సంతోషం తొణికిసలాడుతోంది.

ఇంటి వద్దకే...

గత ప్రభుత్వ పాలనలో పెన్షన్లు తీసుకోవాలంటే చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చేది. పంచాయతీ కార్యాలయాల వద్ద పింఛన్ల కోసం పండుటాకులు పడిగాపులు పడేవారు. పింఛన్‌ సొమ్ము ఎప్పుడిస్తారో తెలియక, రోజంతా తిండీ తిప్పలు లేకుండా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే పరిస్థితి ఉండేది. గంటలు, రోజులు తరబడి పడిగాపులతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పెన్షన్‌ తీసుకోవడం కోసం వారు పడే బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. ఈ పరిస్థితుల నుంచి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విముక్తి కలిగించింది. ఠంచనుగా పింఛన్‌ ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా ఇంటికే అందించే ఏర్పాట్లు చేసింది. వేకువజాము నుంచే పించన్ల పంపిణీ ప్రారంభమవుతోంది. ఇలా పెన్షన్‌ కోసం వేచి చూసే పరిస్థితి నుంచి ఇంటి వద్దకే సొమ్ము అందించే స్థాయికి పెన్షన్‌ విధానాన్ని జగన్‌ సర్కారు తీర్చిదిద్దన విధానాన్ని విప్లవాత్మకమైన చర్యగా భావించవచ్చు.

దరఖాస్తు చేసుకుంటే చాలు..

గతంలో నూతనంగా పెన్షన్‌కు దరఖాస్తు చేయాలంటే ప్రహసనంగా ఉండేది. కొత్త పెన్షన్‌ మంజూరు కావాలంటే ఆ గ్రామంలో లబ్ధిపొందుతున్న వారు మరణిస్తే ఆ స్థానంలో కొత్తవారికి పెన్షన్‌ వచ్చేది. ఈ పద్ధతికి స్వస్తి పలికి అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి పెన్షన్‌ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే మిగిలిన ప్రక్రియలు పూర్తి చేసి త్వరితగతిన అర్హుల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి కొత్తగా 8,298 మందికి పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీరి కోసం ప్రతి నెలా అదనంగా రూ.2.28 కోట్లు వెచ్చిస్తోంది.

పరిస్థితి ఇదీ..

కోనసీమ జిల్లాలో ప్రతి నెలా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, అభయహస్తం, చేనేత, డీఎంహెచ్‌వో, డప్పు కళాకారులు, చర్మకారులు, డయాలసిస్‌ (ప్రైవేట్‌), డయాలసిస్‌ (ప్రభుత్వ), కళాకారులు, ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. నవంబర్‌ నెలలో 2,45,213 మందికి రూ.66,42, 25,750 ప్రభుత్వం మంజూరు చేసింది.

అరకొర నుంచి..

ఆదుకునే స్థాయికి సామాజిక పెన్షన్లు

పడిగాపుల నుంచి

పండుటాకులకు ఉపశమనం

ఠంచనుగా ఒకటో తేదీన

ఇంటి వద్దనే అందజేత

వచ్చే జనవరి నుంచి

రూ.3 వేలకు చేరనున్న వైనం

జిల్లాలో 2.45 లక్షల మంది

లబ్ధిదారులు

ఆస్పత్రికి వెళ్లి పెన్షను అందజేస్తున్న వలంటీరు
1/3

ఆస్పత్రికి వెళ్లి పెన్షను అందజేస్తున్న వలంటీరు

2/3

3/3

Advertisement
 
Advertisement