హవ్వ.. 24 గంటలూ మద్యం అమ్మకాలా?
చంద్రబాబు సర్కారు తీరుపై మాజీ ఎంపీ భరత్‌రామ్ ధ్వజం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, 24 గంటలూ మద్యం విక్రయం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. శనివారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో గోవిందరాజులు గుడి వద్ద మందుబాబు వీరంగం చేయడం దుర్మార్గపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. అష్టాదశ పీఠాల్లో 12వ పీఠమైన ద్రాక్షారామ గుడి వద్ద కపిలేశ్వర లింగాన్ని టీడీపీ క్రియాశీలక సభ్యుడు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని మంటగలుపుతున్న వారిపై ఏ విధమైన చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని పెద్ద రాద్ధాంతం చేసిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ రకమైన జంతువుల కొవ్వు కలపలేదు అని నిర్ధారణ చేసినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతోందన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 44 దేవాలయాలను ధ్వంసం చేయడం, గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు మరణించడం చంద్రబాబు హయాంలోనే జరిగినవేనన్నారు. జగనన్న ప్రభుత్వ హయాంలో రామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసం జరిగిన తర్వాత సంప్రోక్షణ చేయించి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారని చెప్పారు. మా జగనన్న ప్రభుత్వం హిందూ ధర్మాన్ని ఎంత గౌరవిస్తుంది అన్న దానికి అది నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న పరిణామాలను నిలదీయకపోవడం అత్యంత దారుణమన్నారు.


