మేలు చేశామని భావిస్తే ఆదరించండి | - | Sakshi
Sakshi News home page

మేలు చేశామని భావిస్తే ఆదరించండి

Nov 15 2023 7:21 AM | Updated on Nov 15 2023 7:21 AM

- - Sakshi

కొవ్వూరు: చంద్రబాబుకు గతంలో ఐదేళ్ల పాటు అవకాశమిస్తే హామీలను విస్మరించగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందుకు భిన్నంగా నాలుగున్నరేళ్లలోనే 97 శాతం వాగ్దానాలను అమలు చేశారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పెనకనమెట్టలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు,శంకుస్ధాపన కార్యక్రమాల్లో హోమ్‌ మంత్రి తానేటి వనితతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి రాంబాబు మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. టీడీపీ హయాంలో రూ.వెయ్యి ఫించన్‌ ఇస్తే తమ ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి రూ.3 వేలు అందించనుందన్నారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు జగన్‌ ప్రభుత్వం మేలు చేసిందన్నారు. అందుకే మీ ఇంట్లో ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయండని జగన్‌ ధైర్యంతో అడుగుతున్నారన్నారు. ఇలా అడగగలిగిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే అన్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్న పట్టాభి రామారావు(అబ్బులు)కు పార్టీ తగిన గుర్తింపు కల్పిస్తుందన్నారు.

పవన్‌ది ఎన్నికకో మాట

హోమ్‌ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హతే కొలమానంగా వివక్ష లేకుండా పార్టీ రహితంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి మెరుగైన పాలన అందించాలన్న సంకల్పంతో సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎమెల్యే శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోనూ అలాగే ప్రస్తుతం జగన్‌ హయాంలోనూ విద్య, వైద్య రంగం,మౌళిక సదుపాయాల్లో వచ్చిన మార్పులను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందన్నారు. 2014లో పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారన్నారు. కానీ 2019లో చంద్రబాబు అంత అవినీతి ప్రభుత్వం లేదంటూ దుమ్మెత్తి పోశారన్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు పక్కన చేరారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం మంచి చేశారో పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేగా గెలుపు, ప్యాకేజీల కోసమే పవన్‌ చంద్రబాబుని సీఎం చేయాలంటూ తాపత్రయం పడుతున్నారని ఆరోపించారు. అంతకు ముందు రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రోడ్డును, రూ.35 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని హోమ్‌ మంత్రి తానేటి వనితతో పాటు కలిసి అంబటి ప్రారంభించారు. అదే గ్రామంలో దొమ్మేరు పీఏసీఎస్‌కి అనుసంధానంగా రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించే గోదాముకు, రూ.50 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకూ మేలు చేస్తోందన్నారు. దీనిని గుర్తించి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బండి పట్టాభి రామారావు,జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ పోసిన శ్రీలేఖ, ఎంపీపీ కాకర్ల నారాయుడు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుంకర సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చౌటుపల్లి వీరన్న, మాజీ మండల పార్టీ కన్వీనర్‌ ముళ్లపూడి కాశీ విశ్వనాధ్‌,నాయకులు ముదునూరి నాగరాజు, తోట రామకృష్ణ,నల్లకుల సత్యనారాయణ, ఉప్పులూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జల వనరుల శాఖ

మంత్రి అంబటి రాంబాబు

అభివృద్ధి పనులకు

ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

పాల్గొన్న హోం మంత్రి వనిత,

ప్రజాప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement