ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం

నేరస్తులను చూపుతున్న డీఎస్పీ శ్రీలత - Sakshi

ఖరీదైన బైకులే టార్గెట్

ఎలాంటి లాక్ వేసినా క్షణాల్లో అన్ లాక్

నిమిషాల్లో ఊరు దాటిస్తారు.. బైక్ మాయం చేస్తారు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్‌ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.

స్థానిక టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్‌ సీఐ టి.గణేష్‌ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్‌కుమార్‌, నగరంలో తాడితోట వీరభద్రనగర్‌కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్‌ కుమార్‌ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్‌ మెకానిక్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది.

జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్‌ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు.

ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్‌.సుధీర్‌ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్‌ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్‌ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది.

ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.

కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్‌ కానిస్టేబుళ్లు సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎస్‌.రాజశేఖర్‌, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్‌ కుమార్‌, వీరబాబు, బీఎస్‌కే నాయక్‌, ఎస్‌వీవీఎస్‌ఎన్‌ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్‌ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌లను డీఎస్పీ అభినందించారు.

వేసవి చోరీలపై జాగ్రత్త

ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top